పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

203


సీ.

[1]పరమనైసర్గికపరమార్థ మీమంత్ర
        మని చెప్పుదురు బుధు లన్యమంత్ర
ములకుఁ దత్ఫలపూర్తిఁ బొంది చెప్పఁగ[2]శుభ
       దంబగు సుస్వభావంబు లేదు
ప్రణవంబు సర్వమంత్రములకు నాయకం
       బగు నాదియగు బ్రహ్మ మదియ చూవె
యొకటి రెండును నేను నొనరింప వర్ణము
       లష్టాక్షరాఖ్యమై యతిశయిల్లు


తే.

నదియు నారాయణాహ్వయ మాదిప్రణవ
మిడ నమస్కృతితోఁ గూడ నెసక మెసఁగు
సర్వశుభదంబు సర్వార్థసాధనంబు
సర్వదుఃఖాపహరణంబు సౌఖ్యకరము.

106


వ.

సర్వమంత్రాత్మకంబును బరమరహస్యంబు నగు నీ మంత్రంబు
నకు నారాయణుండు ఋషి, శ్రీశుం డదిదేవత, ఛందంబు గాయత్రి,
ప్రణవంబు బీజంబు, నిత్యానపాయిని యగు లక్ష్మి శక్తి యని
త్రిపాదంబున నిమ్మంత్రరాజ ప్రభావంబు చెప్పి, మఱియును
నక్షరత్రితయాత్మకం బగు ప్రణవంబును నతిరహస్యంబులగు
నధిదైవతంబులును బంచవింశతితత్త్వంబులును దదధిష్ఠితంబు
లగు వర్ణంబులును దదుచ్చారణభేదంబులును దదర్థంబులును
బ్రకృతిపురుషాత్మకప్రభావంబులును శేషిశేషసంబంధంబులును
స్వాతంత్ర్యనివృత్తిని విగతమహత్త్వకారణనిదర్శనార్థంబును
నారాయణనామనిర్వచనవాక్యవిశేషంబులును దదీయస్వరూప
నిదర్శనంబులు నగు నుపనిషద్వాక్యంబులును వాసుదేవాచ్యుతా
నంతపురుషోత్తమభగవదాదులగు వివిధనామనిర్వచనంబు
లును వేదమయుండగు పరమపురుషు విరాడ్రూపంబును సర్వజగ
దుత్పత్తిస్థితిలయకారణంబును నారాయణుండ యనియుం బర
మార్థం బుపదేశించి శంకరుండు మఱియు నిట్లనియె.

107
  1. ప్రణవనై సర్గిక (ము)
  2. శుభదంబును (ము)