పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

పద్మపురాణము


సీ.

అగ్నిసన్నిధి నుండి యాచార్యుఁ డాజ్యంబు
       వోయుచుఁ దన్మంత్రమునను వేయు
నెనిమిది యొండె నూటెనిమిది యొండెను
       వేల్చి తక్కిన విష్ణుదేవు మంత్ర
తతిచేతఁ బురుషసూక్తముచేతఁ బాయస
       ఘృతములఁ గొన్ని యాహుతులు వేల్చి
యయ్యగ్నిలోపల నొయ్యనఁ జక్రశం
       ఖములు నిక్షేపించి క్రమముతోడ


తే.

మఱి షడక్షరి నిరువదిమార్లు వేల్చి
తప్తచక్రంబు మంత్రపూతముగ శిష్యు
కుడిభుజంబునఁ జక్ర మయ్యెడమవలన
శంఖమును గాఁగ గురుఁడు గూర్చంగవలయు.

34


వ.

మఱియు హోమశేషంబు సంపూర్ణంబు గావించి సుదర్శనపాంచ
జన్యంబులకుం బునఃపూజ యొనర్చి తదనంతరంబ నూతనకల
శంబులం బవిత్రజలంబుల నించి మంత్రరత్నంబున నభిమం
త్రించి యద్దీక్షితుమస్తకంబున నభిషేచనంబు చేసి ధౌతాంబర
ధరుండును నాచార్యవినయాన్వితుండును నైన యతనికి నాచా
ర్యుం డూర్ధ్వపుండ్రం బిడి మంత్రోపదేశంబు చేసి తన్మంత్రార్థం
బెఱింగించి నిత్యాచారవిశేషవర్తనంబులు బోధింపవలయు.

35


ఆ.

మంత్రలబ్ధుఁడైన మహితుఁ డాచార్యుని
భూషణాంబరములఁ బూజచేసి
యిట్టి మంత్రదీక్ష యేవైష్ణవుఁడు సేయు
నతఁడు నన్నుఁ జెందు నమరవంద్య!

36


వ.

[1]అని చెప్పెనని నారదుండు శౌనకాదిమహామునీంద్రుల కిట్ల
నియె.

37
  1. అని చెప్పి నారదుండు (ము)