పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

183


చ.

అడిగిన నవ్విరించి ప్రియమారఁగ వారికిఁ జెప్పె నన్ను మీ
రడిగిన యర్థమెంతయు రహస్యము దుర్లభ మేరికైన నీ
పుడమియు భూతసంఘమును బుట్టకముందరఁ బూజసేయఁ బెం
పడరఁగ నిందిరాసహితుఁడైన ముకుందుఁడు బ్రహ్మముందటన్.

11


వ.

ప్రత్యక్షంబై యతనికిం బ్రజాపతిత్వంబును సకలవేదశాస్త్ర
నిర్మాణమహత్వంబును నొసంగి స్వప్రకాశంబులై [1]వ్యాపకా
వ్యాపకరూపంబులగు మంత్రంబు లుపదేశించిన సంతుష్టాంత
రంగుండై యద్దేవునకు వెండియు నమస్కరించి విరించి
యిట్లనియె.

12


తే.

దేవ! లక్ష్మీశ! మోక్షంపుఁదెరువు గాంచి
నరులు సంసారసాగరోత్తరణు లౌదు
రెట్టి మంత్రంబుఁ బఠియింతు రెల్లనాఁడు
నట్టి మంత్రంబు దయసేయవయ్య నాకు.

13


క.

ధరఁగల మంత్రంబులలో
నరయఁ బునశ్చరణలేక యతిసులభంబై
నరుఁ డొక్కమాటు దలఁచిన
పరమపదం బొసఁగు మంత్రవర మెద్ది హరీ!

14


వ.

అని యడిగిన నప్పరమేశ్వరుం డిట్లనియె.

15


తే.

అంబుజాసన యిది లెస్స యడిగి తీవు
ఎట్టి మంత్రంబు పఠియించి యెల్లజనులు
నన్నుఁ గూడుదు రమ్మంత్ర మున్నరూపు
వినుము సెప్పెద నతిగుహ్యమును హితంబు.

16


క.

భువి సర్వమంత్రములలోఁ
బ్రవిమలశుభదాఖ్యమంత్రరత్నం బరయన్
దవిలి యొకమాటు దలఁచిన
నవిరళమగు మోక్ష మిచ్చునది యది యనఘా!

17
  1. వ్యాప్యవ్యాపక (ము)