పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

177


క.

అనవుడు రోమశుఁ డిట్లను
మనలో నెడమడుఁగు గలదె మాటికి నీ వి
ట్లననేల మమ్ము మఱవక
యునికిది [1]సంతసముగాక యొండొక టగునే!

180


వ.

అని పలికి వారల కనేకప్రకారంబుల నాశీర్వాదంబు లిచ్చి వీడ్కొని
రోమశుండు మేరుమహీధరంబునకుం జనియె. వేదనిధియును
సంతుష్టాంతరంగుండై తన కోడండ్రను కొడుకునుం దోడ్కొని
యలకాపురంబునకుం జనియె. గంధర్వదంపతులును తమనివా
సంబులకుం జని సుఖం బుండిరని మాఘమాసమాహాత్మ్యంబు
సవిస్తరంబుగాఁ జెప్పి దత్తాత్రేయుండు.

181


మ.

పరమప్రీతి యొనర్చు నీకథ జగత్ప్రఖ్యాతమై [2]పూతమై
[3]దురితవ్రాతము త్రుళ్లణంచుఁ దమమున్ దూలించు నిష్టార్థముల్
కరపద్మంబున నుండఁజేయు సురలోకప్రాప్తి [4]గావించు సు
స్థిరభక్తిన్ బఠియించినన్ వినిన వాక్ఛ్రీ లిచ్చు నెల్లప్పుడున్.

182


క.

అని కృతవీర్యాత్మజునకు
మనునిభునకు మాఘమాసమహాత్మ్యం బె
ల్లను నత్రిపుత్త్రుఁ డేర్పడ
వినిపించెను సరసవాక్యవిస్తరసరణిన్.

183


వ.

ఇట్లు చెప్పుటయు విని కృతాంజలియై యవ్విభుండు మునీంద్రు
వీడ్కొని చని మాఘస్నానంబునుం జేసి కృతకృత్యుండునుం
జక్రవర్తియునై సకలలోకంబులు దాన యేలుచుండె. దత్తాత్రే
యుండు నిజేచ్ఛం జనియె.

184
  1. సమ్మతము (మ)
  2. విఖ్యాతమై (ము), సామర్థ్యమై (మ)
  3. ప్రాయము (ము)
  4. గాఁజేయు (ము)