పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

పద్మపురాణము


క.

అనవుడు రోమశుఁ డిట్లను
విను! నీతనయుండు విదితవేదుఁడు నియతుం
డును గావున నితనికి నీ
వనితలఁ దగఁ బెండ్లిసేయవలయుం జుమ్మీ!

175


వ.

అని యానతిచ్చిన విని వేదనిధి యటమున్న సంతుష్టాంతరం
గులై యున్న తత్కన్యకాజననీజనకులతో విచారించి వివాహ
ముహూర్తంబు నిశ్చయించి మునిజనానుమతంబున విధ్యుక్త
ప్రకారంబుగా వివాహంబు సేయం గంధర్వకన్యకలు నమ్ముని
కుమారుండును నొండొరులచిత్తంబులు కలఁకలు దేఱి పరిపూర్ణ
మనోరథులై మనోభవుం జరితార్థుం జేయ నుమ్మలించుచు నువ్వి
ళ్లూరుచుండి రట్టియెడ.

176


తే.

కొడుకుఁ గోడండ్రఁ దోడ్కొని కోర్కి నిగుడ
వేదనిధి రోమశుని జేరి వినయ మెసఁగ
వారి మ్రొక్కించి తా నభివందనంబు
చేసి యిట్లనె నామునిసింహుతోడ.

177


క.

భూరిగుణాఢ్యుఁడ వగు నీ
కారుణ్యము కలిమిఁ జేసి గతకల్మషులై
వీరు సుఖోన్నతి నీపద
వారిజములు గొల్చువేడ్క వచ్చిరి గణఁకన్.

178


తే.

నీదు సామర్థ్య మెవ్వఁడు నేర్చుఁ బొగడ
[1]నవదరింపుము నామాట లవధరించి
మమ్ము నందఱఁ గృపఁ జూడు నెమ్మితోడ
నెల్లకాలము రక్షింపు మిద్ధచరిత!

179
  1. నవధరింపుము నామాట లాదరించి (తి-హై)