పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

పద్మపురాణము


మోక్షంబును, గామ్యశీలురకుఁ గామితార్థంబులును, సాధకులకు
సిద్ధియును సంభవించునని చెప్పి రోమశుండు మఱియు నిట్ల
నియె.

163


సీ.

[1]రుచిరాస్యుఁ డను ముని యచలితచిత్తుఁడై
         తపము సేయంగ నాతనికి నొక్క
గంధర్వుఁ డవినయకరుఁడైన గోపించి
         వాయసం బగు మని వాని నపుడు
శపియించుటకు వాఁడు సంచలించుచు మ్రొక్కి
        శాపంబు పెడఁబాయుచంద మెల్ల
విని ప్రయాగస్నాన మొనరించి క్రమ్మఱఁ
        దనపూర్వరూపంబుఁ దాల్చి యరిగెఁ


ఆ.

గాన నప్పిశాచకన్యకలును నీదు
సుతుఁడు నస్మదీయసూక్తిఁ జేసి
మాఘమునఁ బ్రయాగమజ్జనం బొనరించి
శాపముక్తులగుట సత్య మనఘ!

164


క.

అని రోమశముని చెప్పిన
యనుపమసత్యోక్తి విని మహాహ్లాదముతో
మునితనయుఁడు గన్నియలును
దనువులు పులకింప ధర్మతత్పరబుద్ధిన్.

165


వ.

తదనుజ్ఞాతులై వారలు తదవగాహం బాచరించుటయుం దత్క్షణంబ.

166


తే.

పరుసమునఁ బొందు లోహంపుఁబ్రతిమ లపుడు
కనకమయమయి కనుపట్టుకరణిఁ దోఁప
వీఁక నప్పుణ్యనదినీరు సోఁకఁ దడవ
దివ్యతనువులు దాల్చి రత్తెఱవ లెల్ల.

167


వ.

అంత.

168
  1. రుచిరాఖ్యుఁ డను (ము)