పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

పద్మపురాణము


చ.

అతులితదివ్యతేజు సుగుణాన్వితు నధ్వపరిశ్రమార్తు సం
తతబహుతీర్థపూతు సుజనప్రియభూషణు విష్ణుపూజన
వ్రతు జనసంగవర్జితు నిరంతరదుఃఖవివర్జితుం గృపా
[1]యతు నొకవిప్రునిం గనియె నగ్గిరిమార్గమునందు బోవగన్.

82


వ.

ఇట్లు కనుంగొని డాయంబోయి యతనిభుజంబునం దున్న గంగా
జలపూరిత[2]కమండలుభారంబు పొడగాంచి మార్గంబున కడ్డంబు
వచ్చి వికృతాకారంబగు తనరూపు చూపి యప్పిశాచంబు పథికు
నకు[3]శాంతస్వరంబున నిట్లనియె.

83


క.

అన్నన్న కుత్తు[4]కెండెడుఁ
గన్నులు మై దిమ్మ దిరిగెఁ గంఠగతంబై
యున్నది ప్రాణము నాకున్
గ్రన్నన నన్నీరు పోసి రక్షింపఁ గదే.

84


వ.

అనుచు గద్గదకంఠంబును, గృశశరీరంబును, ధూమవర్ణంబును,
నిర్మాంసకుక్షివివరంబునునై పాదంబులు నేల మోపకయున్న
యతివికృతాకారంబగు పిశాచంబుఁ గనుంగొని యప్పథికుం
డిట్లనియె.

85


క.

నీ వెవ్వ రివ్విధంబున
నీవనముల నేల తిరిగె దీరూపము నీ
కేవిధమున బాటిల్లెను
వేవేగమె యత్తెఱంగు వివరింపు తగన్.

86
  1. యుతు నొక ..... పోవగ నగ్గిరిమార్గమందునన్ (ము-యతిభంగము)
  2. కరండభారంబు(మ-తి-హై)
  3. శాంతస్వాంతవచనంబుల (మ-హై)
  4. కెండెది (మ-తి-హై)