పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

155


తే.

దల్లిదండ్రులఁ బత్నులఁ[1]దనరు ప్రజల
విడిచి పోయెడువారును వేదవిక్ర
యమున మెలఁగెడువారును నశన మొరున
కమ్ముకొనియెడువారును నవని మఱియు.

78


వ.

పరాన్నభక్షకులును, లుబ్ధులును, స్వామిపరిత్యాగులును, గో
భూమిహర్తలును, [2]రత్నదూషకులును, పుణ్యక్షేత్రంబులం బ్రతి
గ్రహించువారును, బ్రాణిహింసకులును, దేవగురునిందకులును,
సువర్ణవస్త్రతాంబూలాన్నఫలజలంబు లర్థుల కొసంగనివారును,
బ్రాహ్మణస్త్రీధనాపహారులును, ప్రేతరాక్షసపిశాచతిర్యగ్జాతు
లై పుట్టి యుభయలోకవివర్జితులునై యుండుదురు గావునఁ
జతుర్వర్ణంబులవారు నిషిద్ధకర్మంబు లుడిగి యజ్ఞదానతపస్తీర్థ
మంత్రసేవాధర్మంబు లనుష్ఠింపవలయునని పిశాచంబునకు
ధర్మోపదేశంబు చేసి దేవద్యుతి వెండియు నిట్లనియె.

79


తే.

అట్లు ప్రేతయై తిరుగు నయ్యవనిదేవుఁ
డేమి చెప్పుదు వింధ్యమహీధరమున
ఘోరదుఃఖంబు గుడుచుచుఁ గుటిలమైన
పాపఫలమునఁ బైశాచరూప మొందె.

80


వ.

ఇవ్విధంబున నప్పర్వతంబునందు బహుసంవత్సరంబులు గడపి
యంత నొక్కనాడు.

81
  1. తనదు (హై)
  2. పరదూషకులును (హై) పరకాంతాగమనులును, పుణ్యకథాలోకనరహితులును (హై-అధికపాఠము)