పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

పద్మపురాణము


తే.

సర్వభూతాంతరాత్మయు సర్వకర్మ
ఫలదుఁడును సర్వగురుఁడునై పఱఁగునట్టి
విష్ణు నిందించు దుర్మతి వేయునేల
దుర్గతులఁ బొందు నత్యంతదుఃఖి యగుచు.

67


వ.

మఱియుం గుమార్గగమనంబును, వేదవిరుద్ధశాస్త్రశ్రవణంబును,
స్వబుద్దిరచితశాస్త్రాభ్యాసంబును, దేవబ్రాహ్మణతపోధనవేదాగ్ని
నిందలును, నారాయణదర్శనదూషణంబును నరకకారణంబు
లగుం గావున దుర్మదంబు విడువవలయునని చెప్పి యప్పిశాచంబు
నకు హితోపదేశంబు సేయంబూని దేవద్యుతి యిట్లనియె.

68


ఆ.

విను పిశాచ! నీవు ఘనకల్మషముఁ బాసి
దివ్యతనువు దాల్చు తెఱఁగు గలదు
చేయనోపితేనిఁ జేయు ప్రయాగంబు
లోన మాఘతిథుల స్నాన మెలమి.

69


సీ.

తనరఁ బ్రయాగ సుస్నాతుఁ డయ్యెడివాఁడు
        పాపసంఘములెల్లఁ బాఱఁ దోలి
సురలోకనిలయుఁడై తిరిగి రాఁ డెన్నఁడు
        నను వేదవచనంబు వినవె తొల్లి
యాగతపోదానయోగాదిఫలముల
       కతిశయంబగు మోక్ష మాక్షణంబ
కలుగుఁ బ్రయాగమాఘస్నాన మొనరించు
       నట్టి పుణ్యాత్ముల కనుదినంబు


తే.

జహ్నుకన్యార్కకన్యకాసంగమంబు
సూర్యపావకవిష్ణుతేజోమయంబు
నిఖిలకల్మషనిర్ముక్త మఖిలపుణ్య
ఫలదమై యొప్పు నెప్పుడుఁ బ్రకటచరిత!

70