పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

పద్మపురాణము


వ.

అని యి ట్లతిరహస్యంబగు [1]యోగస్తోత్రంబు రోమశుండు చెప్పిన
వేదనిధి యిట్లనియె.

37


క.

మునినాథ! నీ ప్రసాదం
బున దేవద్యుతి రచించు పుణ్యస్తవమున్
వినఁ గంటి మంటి వెండియు
వినఁగ వలయు నతనిచరిత వినిపింపు తగన్.

38


వ.

అమ్మహీదేవుం డేమి కతంబునం బిశాచంబునకు మోక్షం బొసంగె
నవ్విధం బానతిమ్మని యడిగిన రోమశుం డతని కిట్లనియె.

39

రోమశుండు వేదనిధికి చిత్రసేనుని చరిత్రంబు సెప్పుట :

సీ.

చిత్రసేనుండును ధాత్రీశ్వరుఁడు తొల్లి
        కలఁడు సోమాన్వయకరుఁ డతండు
ద్రవిళేశ్వరుఁడు మహోద్దామతేజోనిధి
        ప్రధనశూరుఁడు శస్త్రపారగుండు
దర్పితతురగమాతంగాదిచతురంగ
        బలసమేతుఁడు మహాబాహుబలుఁడు
బహువస్తుపూరితభాండాలయుఁడు రూప
       ధనయౌవనంబులఁ దనరి వేడ్కఁ


తే.

 గూడి లలనాసహస్రంబు గొలిచిరాఁగ
సంతతంబును గ్రీడించు సంతసమున
రాజధర్మంబు దలఁపక రాజసమునఁ
గ్రూరవర్తనుఁడై [2]యుండి గుణము లుడిగి.

40


చ.

సచివులు నీతి చెప్పినను సైఁపక వారి నదల్చి వై చుఁ దాఁ
బ్రచురము గాఁగ వైష్ణవుల భర్జన సేయు విరోధవర్తియై
యచలితమూర్తియైన హరి నాద్యుని నెప్పుడు నిందసేయుచున్
గుచరితుఁడై ధరిత్రిఁ బ్రజకుం గడుభీతి యొనర్చు నెప్పుడున్.

41
  1. స్తోత్రసారంబు (హై), యోగసారస్తోత్రంబు (తి)
  2. యుండు (తి-హై)