పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-చతుర్థాశ్వాసము

145


తే.

నట్టినీయందు నాబుద్ధి యనుదినంబు
తరుణులందును రమియించు తరుణు భంగి
నలమి రమియించుచుండెడు నట్లు గాఁగ
వరముఁ గృప సేయు దేవేంద్రవంద్యచరణ!

33


క.

జాతియు శరీరధర్మము
నాతతమగు గుణము[1]నింద్రియార్థములు నొగిన్
బాఁతిగ నెవ్వనిఁ బొంద వ
నాతురమతి నట్టి నిన్ను నభివర్ణింతున్.

34


వ.

అని భక్తియుక్తిం బ్రశంసించు దేవద్యుతికి మెచ్చి యచ్యుతుం
డిచ్చఁ బిచ్చలించు కరుణారసంబుతోఁ బ్రత్యక్షంబై కోరిన వరం
బిచ్చె నతండును నారాయణపరాయణుండై శిష్యనివహంబుతో
నిజకృతస్తోత్రంబు పఠియించుచుఁ దపోవనంబున సుఖంబుండె
నని రోమశుం డిట్లనియె.

35


సీ.

ఈ స్తోత్ర మతిభక్తి నెవ్వఁడు వినుచుండు
         నెవ్వఁడు పఠియించు నిద్ధబుద్ధి
నతఁ డశ్వమేధసహస్రఫలం బొందు
         నధ్యాత్మవిద్యామహత్త్వ మొందు
నాలుగు చదువులు నోలి ముమ్మాటును
         బఠియించు నట్టి తత్ఫలముఁ జెందు
వాంచితార్థముఁ బొందు వరపుత్రపౌత్రసం
        పన్నసంతానుఁడై చెన్ను మీరు


తే.

నతులదీర్ఘాయురైశ్వర్య మతిశయింపఁ
బావసంఘాతదూరుఁడై భవ్యకీర్తిఁ
జెంది విలసిల్లు నెప్పుడు సృష్టిలోన
విష్ణుపదసౌఖ్యమును గల్గి వెలయుమీఁద.

36
  1. నింద్రియార్థములు (ము)