పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

పద్మపురాణము


మద్భక్తుఁగా నిన్ను మన్నింప వచ్చితి
        భవదీయసన్నుతి ఫణితికేను
మెచ్చితి వరము నీ కిచ్చెద వేఁడు నా
        నత్తపోనిధి ముదితాత్ముఁ డగుచు


తే.

దేవ! పరమాత్మ! గోవింద! దేవదేవ!
జలజనిభకాయ! యుత్ఫుల్లజలజనేత్ర!
బ్రహ్మరుద్రాదులకుఁ గానఁబడని నిన్నుఁ
గంటిఁ గాలంబు కడఁగంటి మంటిఁ గృష్ణ!

13


వ.

దేవా! మోహమూలకంబగు నహంకార[1]మమకారంబులకు హేతు
కంబులైన కర్మంబులు భవద్దర్శనమాత్రంబున భస్మంబులయ్యెం;
గృతార్థుండనైతి; నింతకంటె నభీష్టం బెయ్యది యని [2]పలికి
మఱియును.

14


క.

నా మనమున నీ యడుగులు
నేమంబునఁ గొల్చునట్టి నిశ్చలభక్తిన్
శ్రీ మిగుల నిమ్ము నా కిది
కామించిన యట్టి వరము కరుణాభరణా!

15


చ.

అనవుడు విప్రుఁ జూచి కమలాధిపుఁ డిట్ల ను నీవు గోరిన
ట్లనయము నీకుఁ గావుత మహాత్మ! ప్రసన్నుఁడనైతి నీ తపం
బున కొకయంతరాయమును బొందకయుండెడు; భక్తితోడ నీ
యొనరిచినట్టి సన్నుతి మహోత్తమసంస్తవనీయ [3]మెయ్యెడన్.

16


వ.

కావున నీస్తోత్రంబు పఠియించినవారికిం బరమజ్ఞానోదయంబును
సకలధర్మఫలంబును సంతానాభివృద్ధియును బరమభక్తియు
సిద్ధించుం గావుతమని వరంబిచ్చి యచ్యుతుం డంతర్హితుండయ్యె;
నది యాదిగా దేవద్యుతి నారాయణభక్తితత్పరుం డయ్యెనని
రోమశుండు చెప్పిన విని యచ్చెరువంది వేదనిధి యిట్ల నియె.

17
  1. మమకారంబులు నిర్హేతుకంబైన భవద్దర్శనమాత్రంబున(తి-హై)
  2. కేలు మొగిచి పలికి (హై)
  3. మియ్యెడన్(ము), మయ్యెడున్(తి)