పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మపురాణము

ఉత్తరఖండము - చతుర్థాశ్వాసము


క.

శ్రీనారాయణచరణ
ధ్యానాంతఃకరణ! సకలధర్మాచరణా!
భానుసుతసదృశవితరణ!
మానితగుణధామ! కందమంత్రిలలామా!

1


వ.

పరమయోగవిద్యాగరిష్ఠుండగు వసిష్ఠుండు దిలీపున కిట్లనియె. అ
ట్ల డిగిన వేదనిధిం గనుంగొని రోమశమహామునీంద్రుండు దత్తావ
ధానుండవై వినుమని యిట్లనియె.

2


క.

ఈక్షితి సరస్వతీనది
కక్షీణోదయనివాసమై సంతతమున్
వీక్షింప నొప్పుచుండును
యక్షప్రస్రవణ మనఁగ నచలం బనఘా!

3


వ.

అప్పర్వతంబు సమీపంబున సాలరసాలతాల తమాల హింతాల సం
తానక పాటల నింబ జంబీర జాంబూ కదంబ బిల్వ చిరిబిల్వ వకుళ
తిలక తిందుక మాకంద పిచుమంద బదరి కాశ్వత్థ కపిత్థ ప్లక్షశిరీష
ఖర్జూరార్జున కేతక క్రముక పారిభద్ర తక్కోలనారికేళ [1]తాళికాది
మహీజరాజవిరాజితంబును, మధురమల్లికాకుందవనమాలికా
మాధవీపుష్పలతాకుంజరంజితంబును, వికచకమలకల్హారపరిమళ
మిళితసరోవరపరికలితంబును, నానాద్విజగణసంసేవితంబును,
కిసలయరసోత్కంఠకలకంఠకూజితముఖరితంబును, మధుర
ఫలరసాస్వాదమోదమానరసికరాజకీరవాచాలంబును, ప్రత్యగ్ర
ప్రసూననిర్యన్మకరందమత్తపుష్పంధయగణఝంకారసంకులం
బును, మునికుమారనిరంతరాధ్యయనబధిరీకృతదిగంతరంబును
నైన యొక్కపుణ్యాశ్రమంబు చైత్రరథనందనవనంబుల నతిశ
యించి నిరుపద్రవంబై యుండు నెప్పుడు.

4
  1. దాడిమాది (మ-తి-హై)