పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

123


వ.

ఇ ట్లాక్రాంతంబగు విరహానలంబు సైరింపనోపక యక్కన్నియలు
సఖుల కిట్లనిరి.

156


ఆ.

అకట! మమ్ము నింత యలజడిఁ బెట్టుచు
శిశిరవిధులు మీరు సేయనేల?
యతనిఁ దోడి [1]తేర నారు నీవిరహాగ్ని
లేకయున్న బ్రతుకు లేదు మాకు.

157


వ.

అని పలుకు నవసరంబున.

158


క.

కమలములు మొగుడఁ గలువలు
దమకింపుచుఁ దమక తమక తలచూపఁగఁ బ
శ్చిమదిగ్వధూటి రాగిలఁ
గమలాప్తుఁడు గ్రుంకె విప్రగణము నుతింపన్.

159


వ.

అయ్యవసరంబున.

160


చ.

కలువలవిందు పూవిలుతు గాదిలిచుట్టము రేవెలుంగు వె
న్నెలగని చంద్రకాంతముల నెచ్చెలి లచ్చికిఁ దోడునీడ చు
క్కలగమికాఁడు రాజు కఱకంఠుని యౌదలసూసకంబు పాం
థుల వెఱగొంగ నాఁగ శశి తూర్పుదెసం బొడతెంచె నుగ్రతన్.

161


వ.

ఇట్లు చంద్రోదయం బగుటయు నమ్ముద్దియలకు విరహానలం
[2]బెచ్చినఁ జేతనంబు సడలి మన్మథపరవశలై యుండం జెలికత్తె
లందఱు నుత్తలంబును నివ్వెఱఁగునుం గదిరి భయభ్రాంతచిత్తలై
యుండ నెట్టకేలకుఁ బ్రభాతం బయ్యెఁ దదనంతరంబ.

162


ఉ.

తమ్ముల నిద్రఁ దెల్చి బెడిదంబగు చీఁకటి బాఱఁదోలి లో
కమ్ముల యారటం బుడిపి కన్నులకెల్ల వెలుంగు దానయై
యమ్మును లిచ్చు నర్ఘ్యముల [3]నాతఱి మూర్తులు మూఁడు దానయై
క్రమ్మఱఁ బూర్వశైలశిఖరంబునఁ దొఁచె సరోజబంధుఁడున్.

163
  1. తేక నారునే (హై)
  2. బినుమడించిన (మ-హై)
  3. నాచరమూర్తులు (హై), నాస ద్రిమూర్తులు (తి)