పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

పద్మపురాణము


క.

తరుణులపాలిటి కర్మము
పురుషత్వము దాల్చి వడుగుఁ బొడవండై తా
దొరకొనియెఁ గాక ధర నె
వ్వరికిని నిటువంటి దొంతివలపులు గలవే!

150


తే.

ఒకతె నెబ్భంగినైనను నోమవచ్చుఁ
గోరి యొకతెకు నొకనిఁ దోడ్తేర వచ్చు
గాక యేగురు విరహాగ్నిఁ గ్రాఁగుచుండ
నేమి సేయుదమని యింతులెల్ల [1]బెగడి.

151


చ.

కమలవనంబుపొంత సహకారమహీజముక్రేవ నుల్ల స
ద్భ్రమరనినాదము ల్చెలఁగు ప్రన్నని పూఁబొదరింటిలోనఁ జె
న్నమరెడు చంద్రకాంతపుశిలావలి నొప్పు నరుంగుమీఁదటన్.
సమధికలీల లేఁజిగురుశయ్యలు సేసి సరోజలోచనల్.

152


ఆ.

పుష్పసమితి నెఱపి పూఁదేనెతోఁ గూర్చి
కప్పురంపునీటఁ గలయ నలికి
సతులఁ దెచ్చి యునిచి చలిమందు లొనరింప
నంగజానలంబు నతిశయించె.

153


వ.

ఇ ట్లయ్యతివలు సేయు శిశిరోపచారంబు లన్నియు ననలంబుపై
నేయి చల్లిన చందంబున నంతకంతకుం బెరిగిన విరహానలంబున
నంబుజాసనలు పుష్పశయ్యలు వెన్ను మోపనేర కారాటంబునం
బొరలు సమయంబున.

154


తే.

విరులశయ్యలఁ దనుగాలి వీవ నింతు
లగ్గలంబగు మదనాగ్ని బెగ్గడిలిరి
చెలఁగి నలుఁగడ నెరవలిచిచ్చు గ్రాల
నడుమ సుడిఁగొన్న [2]లేటితండమును బోలె.

155
  1. బొగిలి (హై)
  2. లేడిదండమును (ము)