పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

పద్మపురాణము


క.

అక్కట! సద్ద్విజజన్మము
నెక్కొనియును జేసికొనిన నేరిమి నిన్నుం
ద్రెక్కొనఁ గష్టపుబాములఁ
బొక్కుచు నిన్నేడు లెట్లు పొరలితి తండ్రీ!

92


క.

నినుఁ జూచి నామనంబున
ననుకంప జనించె దోష మణఁగెడివిధ మే
ననుసంధించెదఁ దెలియఁగ
వినుమని రాక్షసునితోడ వెలఁదుక పలికెన్.

93


సీ.

గంగయు యమునయుఁ గలసిన యచ్చోట
        నేనాడు మాఘంబు లెన్నియేని
గల వందులోన నీ కలుషంబుఁ దలఁగింప
        నవి మూఁడుదినముల ఫలము [1]నిప్పు
డిచ్చెద నంత నీ వీరూప మెడఁబాసి
        యమరత్వ మొందెద వనుచుఁ జెప్పి
తడిచీరకొంగునఁ [2]బిడిచిన జలములఁ
        దత్ఫలం బతనికి ధారవోయ


ఆ.

నతఁడు రాక్షసత్వ మప్పుడే పెడఁబాసి
దివ్యతనువుఁ దాల్చి తేజరిల్లి
సంతసంబు ప్రియము సందడి పడుచుండ
నమ్మృగాక్షి కిట్టులనియె మ్రొక్కి.

94


ఆ.

వెడలఁబాటు లేక వేఁగుచునున్న నా
దురితవితతిఁ బాఱఁదోలి నీవు
నాకలోకసుఖము నా కిచ్చితివి మాఘ
మజ్జనప్రభావమహిమఁ జేసి.

95
  1. నీకు నిచ్చెద (మ-హై)
  2. ముడిచిన (ము)