పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

పద్మపురాణము


చ.

అని దయపుట్ట నాడిన నహల్యయు నూరకయుండె నింద్రుఁడుం
దనమది కోర్కి దీర్చుకొని తత్తఱ మందుచు మింటికేగె న
వ్వనితయు లేచివచ్చి తనువల్లిక దివ్యసుగంధవాసనల్
తనరఁగ నెమ్మనంబున ముదంబు భయంబును దోఁప నున్నెడన్.

34


క.

తెలతెల వేగుడుఁ బులుఁగులు
కలకల పలుకంగ జగము కన్నులు దానై
తళతళ వెలుఁగుచుఁ దమ్ముల
చెలి యల్లన నుదయశిఖరి శిఖరం బెక్కెన్.

35


వ.

ఇట్లు సూర్యోదయం బగుటయు సముచితానుష్ఠానంబులు దీర్చి
శిష్యగణసమేతుండై గౌతముండు చనుదెంచిన భయసంభ్రమా
కులితచిత్తయై యహల్య యెదురు వచ్చి.

36


చ.

చెదరిన కుంతలంబులును జిన్నిమొగంబును వింతకాంతియున్
బెదరినవాలుఁజూపులును బింకము చూపుచు నొప్పు మోవియుం
గుదివడుచున్న నెన్నడుముఁ గూరిన దప్పియు మేన నెల్లెడం
గదిరిన దివ్యగంధమును గాంచి మునీంద్రుఁడు సంశయంబుతోన్.

37

గౌతముం డహల్యకు నింద్రునకును శాపంబు లిచ్చుట :

క.

పోలించి చూచి సురవిభుఁ
డాలలనం గవయు టెఱిఁగి యమ్ముని క్రోధ
జ్వాలలు [1]నిగుడఁగఁ గన్నులఁ
గాలాంతకుపగిది నింతిఁ గనుఁగొని పలికెన్.

38


వ.

కులశీలగుణంబులు విచారింపక యింద్రుతో వ్యభిచరించి [2]చెట్ట
చేసితివి కావున నిశ్చేతనంబగు పాషాణంబవై యుండుమని య

  1. నిగుడఁగఁ గన్నుల (ము)
  2. బద్ది (హై)