పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మపురాణము

ఉత్తరఖండము - తృతీయాశ్వాసము

క.

శ్రీకర వాణసకులర
త్నాకర! [1]సంపూర్ణకరసుధాకర! [2]ఘనశో
భాకర! సంతతదానద
యాకర! సత్కీర్తిబృంద! యబ్బయకందా!

1


వ.

పరమయోగవిద్యాగరిష్ఠుండగు వసిష్ఠుండు దిలీపున కిట్లనియె.
నట్లు కాంచనమాలిని యడుగుటయు నవ్విప్రుం డిట్లని చెప్పె.

2

కాంచనమాలిని బ్రహ్మరాక్షసునకుం జెప్పిన మాఘస్నానప్రభావము :

క.

కృతయుగమున గౌతముఁ డను
నతిపావనమూర్తి మునివరాగ్రణి వహ్ని
ప్రతిమానతేజుఁ డిల న
ప్రతిహతరోషుండు వేదపారగుఁ డొప్పున్.

3


తే.

అమ్మహాముని పత్ని యహల్య యధిక
లక్షణాన్వితహాసవిలాసవిభవ
సౌమ్యలావణ్యసౌందర్యచతురగతుల
నమ్మృగాక్షికి నీడులే దవనియందు.

4


వ.

ఇ ట్లతిశయరూపయౌవనంబులు గలిగి తనకు ననురక్తయగు
భార్యయుం దాను నొక్కపుణ్యారణ్యంబునం దాశ్రమంబు
నిర్మించుకొనియుండె నంత.

5
  1. సంపూర్ణతర (మ-తి-హై)
  2. గుణశోభాకర (మ)