పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

89


వ.

అది యెయ్యది [1]యంటేని పిన్ననాటనుండియు దానధర్మ
తీర్థపరోపకారంబు లెఱుఁగకయును నిరంతరంబుం బరధనాపహర
ణంబును బరదోషాన్వేషణంబునుం జేయుచు నొరులకుఁ గీడు
సేయుటయు వినోదంబును నడఁకించుటయు నేర్పున ధనంబుఁ
గొనుటయుం బురుషార్థంబులుగా నిన్నిదినంబు లనృతవర్తనం
బునం దిరుగుచుండి యిప్పుడు.

228


క.

తలఁచుకొని నేఁడు దూలము
తలఁ దాకిన [2]నులికినట్లు దావము మదిలో
మొలవఁగ నీ సుఖ మంతయుఁ
గలలో నై నట్లు నాకుఁ గానంబడియెన్.

229


వ.

కావున నీప్రపంచంబంతయు మిథ్యగా విచారించి భవత్సన్నిధికిం
జనుదెంచితి; నిద్దురితదుఃఖార్ణవమగ్నయగు న న్నుద్ధరించి పుణ్య
లోకంబులు గలుగు నుపాయంబు చింతించి యానతిమ్మని
మ్రొక్కిన న వ్విప్రవరుండు నన్నుం గనుంగొని యాదరంబున
నిట్లనియె.

230


క.

తొడుగను బూయను ముడువను
గుడువను నెఱిఁ గట్టఁ గలిగి కుత్సితమతివై
[3]వెడబుద్ధులు వారింపుము
పడఁతి వినంబొత్తుగాని పలుకులు [4]గలవే.

231


క.

సుదతులు దగ మన్నింపఁగం
బదివేవురు నిన్ను నాసపడు సంపదతో
మది మది నుండియు నిటు నీ
హృదయము వైరాగ్యవృత్తి నేటికిఁ దగిలెన్.

232
  1. యనిన నేను బుట్టిననాటనుండియు (ము)
  2. పగిది నిట్లు (హై), మడికి యట్లు, మదికి నట్లు (తి)
  3. పెడబుద్దుల నూహింపుచు (హై), చెడుబుద్ధులు బోధింపుచు (తి)
  4. తగునే (మ-తి-హై)