పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

పద్మపురాణము


ఆ.

మాంసవిక్రయంబు మనుగడగా నున్న
కటికవాఁడు పాపకర్ముఁ డవని
నంతకంటెఁ బాప మాత్మసౌఖ్యం బొరు
[1]కమ్ముకొని చరించు నంగనలకు.

222


వ.

అని [2]విచారించుచున్నయెడ నవ్విటుండు చనుదెంచి పిలిచి
నం బలుకక [3]త్రోచిపుచ్చినం బోయె నంత నా కత్యంతవైరా
గ్యంబు మనంబునం బుట్టి సంసారం బంతయు [4]నిస్సారంబుగా
వగచుచున్నయెడఁ బ్రభాతం బగుటయు.

223


తే.

ఆ పురంబున విద్వాంసు నఖిలశాస్త్ర
వేది సౌమ్యాత్ము నాత్మార్థవిదుఁ బ్రసన్ను
రూపవంతుని రాజపురోహితాఢ్యుఁ
గాన నేగితిఁ జిత్తంబు గళవళించి

224


చ.

అనుపమగంధపుష్పమృదులాంబరసంఘము వేడ్క నిచ్చి స
య్యన ధరఁ జాగి మ్రొక్కి వినయంబునఁ బ్రాంజలినైన నన్ను న
య్యనఘుఁడు గారవించుచు దయారసదృష్టినిజూచి నీవు వ
చ్చిన కత మేమి మాకడకుఁ జెప్పుము ప్రీతిఁ బయోరుహాననా !

225


వ.

అనిన విని మోడ్పుఁగేలు ఫాలంబునం గదియించి యతని
వదనంబుఁ గనుంగొని యిట్లంటి.

226


క.

దురితముల కెల్ల మూలము
లరుదుగ ధరఁ బడసి కుడుచు నంగన లందున్
సరివోల్ప రాని పాపము
తిరముగ నేఁ బుట్టి పెరిగి తిమ్మరుటెల్లన్.

227
  1. కమ్మి కుడుచునట్టి యంగనలకు (హై)
  2. విచారించి చింత పేటెత్తుచున్న యెడ (హై)
  3. యాత్మజ్ఞానంబున ధ్యానంబు చేయుచున్న జారుండు శరీరస్పర్శంబు చేసె నది తెలియనైతి నెట్టకేల కెరింగి దండ నిలిచియున్న విటుని త్రోచిపుచ్చినం (హై)
  4. నిస్సారంబకా యెరింగి వగచుచున్న (హై)