పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

పద్మపురాణము


సీ.

దినదినం బొదవెడు వనజకుట్మలభాతి
        నెక్కొన్న చనుదోయి నిక్కుదోఁచె
నళుల ఱెక్కలమీఁద హరినీలరుచి మించు
       గతి కుంతలంబులఁ గప్పు మెఱసె
నునుసానఁ దీరిన మనసిజాస్త్రములు నా
       సోఁగకన్నుల వింతసొబగు నిగిడె
వెలఁది వెన్నెలనీటఁ దొలఁచిన ముకురంబు
       కరణి మోమునఁ గ్రొత్తకాంతి దనరె


తే.

నడుము [1]బళువయ్యె మాటల నవక మెక్కె
నడుగుదమ్ముల నునుజిగి యగ్గలించె
[2]విటజనావళి చూడ్కికి వెక్కసముగఁ
జెలఁగె నా మేను యౌవనశ్రీ వహింప.

214


వ.

ఇ ట్లత్యంతరమణీయంబగు యౌవనంబు నివ్వటిల్లు సమయంబున
వివిధవిలాసచాతుర్యసౌందర్యసౌభాగ్యంబులయందు వారాంగనా
సమూహంబులలో మత్సదృశలు లేకుండునట్లుగా ననేకకళావిద్య
లం బ్రవీణనై విటకుమారపటలంబుల మనంబు లాకర్షించి నానా
మణిఖచితదివ్యాభరణంబులును నానావర్ణదుకూలాదిదివ్యాంశుకం
బులును ననేకదాసదాసీజనంబులుం గలిగి యఖిలభోగంబు
లనుభవించుచు మఱియును.

215


ఉ.

అంగజుదీము పల్లవుల యంగిటిగాలముఁ గూర్చువారి ముం
గొంగు పసిండి సౌఖ్యముల క్రోవి[3]ప్రియోక్తుల జన్మభూమి యా
లింగన చుంబనాది బహులీలలఁ గేలి యొనర్చునంచుఁ బ్రౌ
ఢాంగనలెల్ల నన్నుఁ గొనియాడఁ జరించితి నేర్పు లేర్పడన్.

216
  1. బడుగయ్యె (తి-హై)
  2. సరసగంభీరమోహచాతురి వహించె (మ)
  3. కళాదుల (తి-హై)