పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

79


వ.

అందు మాఘస్నానంబు చేసిన మానవుండు ప్రకృతిమాయలం
[1]జెందక పునరావృత్తి లేని విష్ణులోకంబునం దచ్యుతస్వరూపం
బున విహరించుచుండు. తత్ఫలంబు చిత్రగుప్తుండు నింతంత
యని చెప్పనేరం డచ్చట మూఁడుదినంబులు స్నానంబు సంభ
వించెనేనిం ద్రిశతవత్సరంబులు నిరాహారులై తపంబు సేయు
యోగీశ్వరులకుఁ గల ఫలంబు [2]సిద్ధించు, మఱియును.

172


తే.

కనకభారసహస్రంబు గ్రహణవేళ
నఖిలవేదాఢ్యులకు నిచ్చునట్టి ఫలము
గలుఁగు నెంతయుఁ దత్ప్రయాగంబునందు
నొక్కపరి మాఘమాడిన యుత్తములకు[3]

173


ఆ.

మాఘమునఁ బ్రయాగమజ్జనం బదిమూఁడు
దినము లబ్బెనేని మనుజుఁ డఘముఁ
బాసి దివ్యతనువుఁ బ్రాపించుఁ గుప్పసం
బూడ్చి వెలుఁగుచున్న యురగ మట్లు.

174


వ.

మఱియు భాగీరథి యిక్కడక్కడనక యంతయుఁ గురుక్షేత్ర
సమంబ; యందు వింధ్యగిరిసంగమంబు దశగుణఫలంబు నిచ్చు;
దానికంటెఁ గాశీక్షేత్రంబున నుత్తరవాహిని శతగుణం; బచ్చటి
కంటె గంగాయమునాసంగమంబు సహస్రగుణఫలంబు లొసఁగుఁ;
దజ్జలస్పర్శనమాత్రంబున బ్రహ్మహత్యాదిపాతకంబులు హరించు;
మఱి యమృతమయం బనం బ్రసిద్ధిం బొందు; నింక వేణీనదీ
మహత్త్వంబు వినుము.

175
  1. బాపి (ము)
  2. సంభవించు (ము)
  3. ఈ పద్యము తరువాతగల యధిక పాఠము.
    ఆ. మాఘమాస తిథుల మనుజుండు వేణిలో
    గోరి యొక్క మాటు గ్రుంకెనేని
    నఖిల నదులయందు నవగాహ మొనరించు
    నట్టి ఫలము బొందు నవనినాథ. (తి-హై)