పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

77


ఆ.

వేదవితతి సెప్పు విను గ్రహంబులలోన
నినుఁడు చుక్కలందు నిందుఁ డెట్లు
వెలుఁగు నట్లు మాసవితతిలో మాఘంబు
పావనం బనంగఁ బరఁగుచుండు.

162


చ.

మకరదినేశులం గలుగు మాఘమునందులఱేపు భక్తితో
నకుటిలవృత్తి గోష్పదమునందుల నీరనునైన మజ్జనం
బొకపరి చేసి పాపియును నుత్తమ నాకసుఖంబుఁ బొందుటల్
ప్రకటితమైన యోగమిది ప్రాజ్ఞులు సెప్పుదు రాగమోక్తులన్.

163


వ.

అందును వ్రతం బనుష్ఠించుట యుత్తమం బది యెట్టు లనిన.

164


సీ.

మాఘాదినుండి నేమముతోడ సూర్యోద
       యమున నదీస్నాన మమరఁ జేసి
ఘృత మాష తిలల నాహుతు లిడి వేల్చుచు
       భూశయ్యుఁడై యేకభుక్తమునను
ఘనసారమృగమదాగరుకుంకుమాదులఁ
       బొరిఁ ద్రికాలము విష్ణుపూజ చేసి
కార్పాసపాదుక [1]కంబళేంధనపట
       తైలఘృతాదులు దాన మిచ్చి


తే.

మును పరాన్నప్రతిగ్రహములు దొలంగి
తైలసేవయు మాని వ్రతంబు సల్పి
[2]మాససంపూర్తిఁ గడ నుత్తమద్విజులకు
నిష్టభోజనదక్షిణ లిడఁగవలయు.

165


వ.

ఇవ్విధంబున వ్రతోద్యాపనంబు చేసిన పుణ్యుం డక్షయలోక
సౌఖ్యంబు లనుభవించుచు మఱియును.

166
  1. కంబళ ధనపట (హై-తి)
  2. మానసస్ఫూర్తిఁ గడు (ము)