పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

71


క.

ఈ లోకంబునఁ బెట్టక
యా లోకంబునను గలుఁగ దటు గాన సుమీ
మేలౌ దానము ధర్మముఁ
గాలోచితగతులఁ జేయఁగాఁ దగు మనుజుల్.

134


సీ.

అది యెట్టిదన్నను నధికధనాఢ్యులు
       పుణ్యలోకంబునఁ బొంది పిదప
సద్వంశజాతులై సమత దీర్ఘాయుస్స
       మేతులై సంపత్సమృద్ధు లగుచు
నఖిలభోగార్హులు నార్యవర్తనులునై
       జనియింతు రవనిలో ననఘవృత్తి
మాటికి నిటఁ బెక్కుమాట లేల యధర్మ
       వర్తి దుర్గతినొందు నార్తుఁ డగుచు


ఆ.

ధర్మవర్తనుండుఁ దగఁ బుణ్యలోకంబు
లందుఁ గాన బాల్య మాదిగాఁగ
ధర్మపరుఁడు గాఁగఁ దగు మర్త్యుఁ డని యతం
డనియె నవ్వికుండలునకు మఱియు.

135


క.

విను మింక నెద్దియేనియు
నను నడిగెడు వేడ్క నీ మనంబునఁ గలదే?
యనుడు వికుండలుఁ డాతనిఁ
గనుఁగొని యిట్లనియె నధికగౌరవ మెసఁగన్.

136


క.

నీ మధురవాక్యము ల్విని
నా మనము ప్రసన్న మయ్యె నాకుం జూడన్
నీ మహితసుజనగోష్ఠిన్
సామర్థ్యము గలుగువారు సజ్జను లెందున్.

137


ఆ.

గంగ నెట్టి పాపి గదిసిన బుణ్యుఁడై
యొప్పినట్లు నీవు సెప్పినట్టి
పుణ్యభాషణములఁ బుణ్యుండ నైతి ను
త్తమగుణాఢ్య! నిత్యధర్మచరిత!

138