పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

69


శిలాదానంబు సకలధరావలయదానఫలంబు నిచ్చుఁ. దన్మూల్య
వక్తయు విక్రేతయు ననుమతయు ననువీరలు నరకగాములు
గావునఁ దద్విక్రయంబు వలవదు. మఱియు నొక్కవిశేషంబుఁ
జెప్పెద వినుమని యమకింకరుం డిట్లనియె.

123


తే.

వేయు నేటికి నొకమాట వినుము వైశ్య
ఘోరభవములఁ దొలఁగించుకొను [1]శ్రుతంబు
గలదు హరినామ మొకమాటు దలఁచిరేని
నట్టి పుణ్యులు వొందుదు రవ్యయంబు.

124


చ.

అడవులఁ గందమూలకఫలాశనులై విజితేంద్రియాత్ములై
విడువక వేదము ల్చదివి విశ్రుతమైన తపంబు సేయఁగాఁ
బడసిన తత్ఫలం బొదవుఁ బంకజనాభుని నామ[2]సంస్తుతిం
దడయక చేయుచున్న హరిదాసుల కెందుఁ దలంచి చూడఁగన్.

125


వ.

అని చెప్పి మఱియు నిట్లనియె.

126


క.

హరిదినమున నుపవాసం
బరుదుగఁ బ్రాసంగికముననైనఁ జరింపన్
నరకమును జెందఁ డనియును
బరువడి సమవర్తి పలుకు పలుకులు వింటిన్.

127


తే.

రాజసూయశతంబు దురంగమేధ
యాగశతమును జేసిన యట్టి ఫలము
నొక్కహరివాసరమునందు నుపవసించు
ఫలము పదియాఱవగు పాలి పాటిరావు.

128


క.

ఏకాదశేంద్రియంబులఁ
బ్రాకటముగఁ జేయునట్టి పాపము లెల్లన్
వైకల్యమొందు నొకపరి
యేకాదశి నుపవసించునేనియు ననఘా!

129
  1. మతంబు (ము)
  2. సంస్మృతిం (ము)