పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

పద్మపురాణము


వ.

మఱియుఁ బుండరీకాక్షుండును లక్ష్మియందు వైకుంఠంబు
నందును విహరించునట్లు సాలగ్రామశిలల ననవరతంబు నుండుఁ
గావునం దత్పూజనంబు చతుస్సముద్రముద్రితధరాదానంబు
కంటె నధికఫలంబు నిచ్చు.

117


ఆ.

దానతీర్థశక్తిహీనుఁడై యుండిన
నరుఁడు ముక్తి నొందుఁ బరమభక్తి
[1]నిత్యనియమలీల నెగడి సాలగ్రామ
శిలల విష్ణుపూజ సేయునేని.

118


తే.

ఓలిఁ బండ్రెండుమూర్తుల నొక్కపీఠ
మునను నొకనాఁడు పూజచేసిన యతండు
లీలఁ బండ్రెండుకోటుల లింగములను
బసిఁడితమ్ములఁ బూజించు ఫలము నొందు.

119


ఆ.

ఎచట నిట్టిమూర్తి యే కాలమును నుండు
నచట యోజనత్రయంబు దీర్థ
మగుట ధర్మకర్మ మయ్యెడ నొనరింపఁ
గోటిగుణిత మండ్రు మేటిమునులు.

120


ఆ.

పంచగవ్యములును బహుతీర్థజలములు
వేయుమార్లు గ్రోలు విపులఫలము
గలుగు నొక్కనాఁడు గదిసి సాలగ్రామ
తీర్థమాను పుణ్యదేహులకును.

121


క.

విను సాలగ్రామశిలా
వినుతజలం బాను నతఁడు వెండియు జననీ
స్తనపాన మాచరింపక
ఘనముగ వైకుంఠమునను గాఁపురముండున్.

122


వ.

మఱియుఁ దచ్ఛిలాధిష్ఠితస్థలంబునకుఁ గ్రోశమాత్రంబున మృతు
లైన జంతువులు వైకుంఠంబు నొందుదు; రట్లగుట సాలగ్రామ

  1. నియమనిత్యలీల (ము)