పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వస్తే ప్రస్తుతకాలంలో మనం ఆమోదించలేం కాని, అసలు మానవులలోనే అష్టాదశజాతిభేదా లున్నాయని ప్రాచీను లన్నారు. మరింతగా పరిశీలించి చెప్పాలంటే ఆకలి, దప్పి, భయం, కోపం, సంతోషం, కోరిక, నిద్ర, వార్ధక్యం, మరణం, జననం, మదం, స్వేదం, దుఃఖం, జాగ్రత, స్వప్నం, బాల్యం, కౌమారం, యౌవనం, అని దేహసంభవగుణాలు 18 గా పేర్కొన్నారు. చివరికి మానవులలో వుండే వివిధ వ్యసనాలను కూడా 18కే పరిమితి చేశారు. వేట, జూదం, పగటినిద్ర, పరనింద, దివామైథునం, మద్యపానం, నృత్యవ్యసనం, గానలోలత, వాద్యవ్యసనం, వ్యర్ధదండనం, చాడీలు చెప్పడం, అతిసాహసం, ద్రోహచింత, కాపట్యం, అసహనం, పరుషభాషణం, దూషణం, అన్యాయదండన అని వీటిని కామ, క్రోధ జన్యాలుగా పేర్కొన్నారు. ఇంతటితో ఆగక మానవుని వివాదస్థానాలకు కూడా 18కే పరిమితంచేసి పేర్కొన్నారు. అవి యివి. అప్పు సకాలంలో తీర్చకపోవడం - ఇతరులవద్ద సొమ్ము దాచడం - హక్కులేని ఆస్తి అమ్మడం- ఉమ్మడి వ్యాపారం - దానమిచ్చి తిరిగిపుచ్చుకొనడం - కూలి వగైరాలు యివ్వకపోవడం - నియమోల్లంఘన - క్రయవిక్రయాలలో మాట తప్పడం - పశుపాలకులతో సంబంధం - సరిహద్దుల విషయం - పరదూషణం - కొట్టడం - దొంగతనం - బందిపోటుతనం - స్త్రీలను చెరపట్టడం - పురుషపరస్పరధర్మాల యేర్పాటు - దాయభాగం వివిధ జూదాలు.

మానవులు పండించే వివిధధాన్యాలు కూడా 18 రకాలని పేర్కొన్నారు. అవి యవలు - గోధుమలు - వరి - నువ్వులు - కొఱ్ఱులు - ఉలవలు - మినుములు - పెసలు - సిరుసెనగలు - అనుములు - ౘామలు - ఆవలు - గవేధుకములు - నివ్వరిధాన్యం - కందులు - సతీనకాలు - సెనగలు - చీనధాన్యం. (ఈ ధాన్యాలలో ఇప్పుడు లభ్యమయ్యే ధాన్యాలు కొన్ని చేరివుండకపోవచ్చును.) పరోపకారబుద్ధితోగాని దోషారిష్టనివారణార్థంకాని, పుణ్యసముపార్జనార్థంగాని చేసే దానాలు కూడా అష్టాదశ సంఖ్యకే పరిమితాలని ప్రాచీనులు పేర్కొన్నారు. ఆ 18 దానాలు యివి. తులాపురుషం, హిరణ్యగర్భం, బ్రహ్మదండం, స్వర్ణం, పంచలాంగలం, స్వర్ణధేనువు- సాలంకృతహేమవృషభం - సాలంకృతలక్ష్మీప్రతిమ - సాలంకృతసప్తాచలం - సప్తసముద్రం - గజం - స్వర్గచ్చాయ - భూగోళం - కనకపర్వతం - కామధేనువు - కల్పవృక్షం - రజతపర్వం - సహస్రధేనువు. ఈదానాలు ఆర్షవిజ్ఞానపరమైనవేకాని మామూలు తిలతండులాది దానాలవంటివి కావు.

కాలం యెంత సుదీర్ఘమైనదనా 18 రెప్పపాట్ల కాలాన్ని ప్రాచీనులు "కాష్ఠం"గా పేర్కొన్నారు. ఇంతెందుకు? అసలు మొత్తం భూమండాలాన్నే 18 ద్వీపాలుగా మన మహర్షులు విభజించి వర్ణించారు. వాటికి రమ్యకం - రమణకం -