పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాండాగారంలో ఆర్. సి. నెం. 547. కె-1-59 గారి కాగితపుసంపుటాలలో యీ యెనిమిది ఆశ్వాసాల కృతి 1918 లో తాళపత్రప్రతిని చూచి కాపీ వ్రాయడం జరిగింది. కాకినాడలోని ఆంధ్రసాహిత్యపరిషత్తులో సైతం నరసింహకవి కృతమైన నారదీయపురాణతాళపత్రప్రతి వొకటున్నది కాని అది అసమగ్రంగా వున్నది. మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తకభండాగారంలోని 8 సంపుటాలలో వున్న వ్రాతప్రతి ఆధారంగా ప్రస్తుత నారదీయపురాణం పరిష్కరించి ప్రకటించడం జరిగింది.

నరసింహకవి కృతమైన యీ నారదీయపురాణం ముద్రితమైన సంస్కృత నారదీయమహాపురాణానికి అనువాదం కాదు. నారదీయ ఉపపురాణం మనకు ఉపలభ్యమానం కానందువల్ల నరసింహకవి కృతమైన యీ నారదీయపురాణం ఆ ఉపపురాణానికి అనువాదగ్రంథమని దృఢంగా చెప్పలేము. సామాన్యంగా ఉపపురాణాలు తొలుత మహాపురాణాలకు సంగ్రహస్వరూపంగా అవతరించినవే అయినా వాటిలో అనంతరకాలంలో వివరణాత్మకాలుగా - మూలపురాణాలలో లేనటువంటి విషయాలు - ఆ పురాణాలకు అనంతరకాలంలో అవతరించిన వివిధవిభిన్నశాస్త్రీయాలైన విశేషాలు చొప్పించడం జరిగింది. దీనివల్ల ఉపపురాణాల ప్రామాణికత దెబ్బతిన్నది. మృత్యుంజయకవి రచించిన బృహన్నారదీయం పూర్వార్థంలోని ప్రథమపాదానికి మాత్రమే పరిమితమై 41 అధ్యాయాలతో కూడిన సంస్కృతమూలానికి ఆరాశ్వాసాల అనువాదగ్రంథంగా మనకు ఉపలభ్యమానమైనది. నారదీయమహాపురాణంలో పూర్వార్థమంతా అనువాదం కావాలంటే, మరి మూడుపాదాలు, 84 అధ్యాయాలతోను మొత్తం 9545 శ్లోకాలతో వున్న (ప్రథమపాదం-3229 శ్లో. ద్వితీయ, తృతీయ, చతుర్థపాదాలు 9545 శ్లో. అనగా నాలుగుపాదాలలో మొత్తం 12774 శ్లోకాలు వున్నాయి) మిగిలినభాగం అనువదించవలసి వున్నది. విచిత్రమేమంటే నరసింహకవి కృతమైన నారదీయపురాణం 99 పాళ్లు సంస్కృతమూల నారదీయమహాపురాణంలోని ఉత్తరార్థంలో వున్న కొన్నివిషయాలకు మాత్రమే పరిమితమై సంగృహీతమై వున్నది. అయితే సంస్కృత నారదీయపురాణంలో పూర్వార్థంలో ప్రథమపాదం చివర వర్ణింపబడిన చతుర్యుగధర్మాలలోని కలియుగధర్మాలు తెలుగులో కొన్ని వివరింపబడ్డాయి. ఒకవేళ మృత్యుంజయకవి నారదీయమహాపురాణపూర్వభాగాన్నిమొత్తం అనువదించి వుంటే, అతని తరువాతికాలంలోనే వున్న నరసింహకవి దానికనుబంధంగా ఉత్తరార్థాన్ని పరిగ్రహించి దీన్ని రచించాడా అని సందేహం కలుగుతున్నది. అయితే మృత్యుంజయకవి బృహన్నారదీయపురాణరూపంగా అనుసరించిన అనువాదపద్ధతికి, నరసింహకవి అనుసరించిన