పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనువదించదలచిన యేకవియైనా అవతారికలో ఆమహాపురాణంలోని విషయాలను చెప్పదలిస్తే విభాగాలతోకాని పాదాధ్యాయాలతోకాని, ప్రమేయం లేకుండా మొత్తం మహాపురాణగతవిషయాలనన్నింటినీ పేర్కొంటాడే తప్ప, కేవలం ఏకైకపాదానికి పరిమితంకాగల విషయాలను మాత్రమే పేర్కొని అనౌచిత్యానికి పాల్పడతాడా! అన్నదికూడా ఆలోచించవలసిన విషయమే. గ్రంథగతవిషయవివరణాన్ని చేసినపుడు అవతారికలో గ్రంథవిషయసర్వస్వాన్ని సమకూర్చినట్లు నన్నయభట్టుప్రభృతుల భారతాదిగ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. ఏతత్ సాంప్రదాయనికి విరుద్ధంగా మృత్యుంజయకవి నారదీయమహాపురాణగతవిషయా లన్నింటినీ పాదాత్మకాలుగా విభజించి పేర్కొంటాడా! అన్నది సందేహాస్పదంగా వున్నది. అయితే వొకవిషయంమాత్రం విస్పష్టంగా, వాస్తవంగా ఆశ్వాసాంత్యగద్యలను చూచినపుడు నారదీయమహాపురాణాన్ని మృత్యుంజయకవి సుసమగ్రంగా అనువదించాలని అభిప్రాయపడ్డాడని, తన బృహన్నారదీయపురాణం సంస్కృత నారదీయమహాపురాణ అనువాదగ్రంథంగానే భావించాడని మనకు తేటతెల్ల మౌతుంది. ఈ దృష్ట్యా ప్రథమాశ్వాసగత అవతారికలో పేర్కొన్నవిషయాలు సంస్కృత మహాపురాణంలోని ప్రథమపాదగతవిషయాలు మాత్రమే అవడంవల్ల సంప్రదాయభిన్నంగా పాదాత్మకంగా విషయవివరణ చేసి బృహన్నారదీయపురాణాన్ని రచించాలని మృత్యుంజయకవి సంకల్పించి వుంటాడని మనం భావించవలసి వస్తుంది. కాగా మనకు ఉపలభ్యమానమైన తెలుగు బృహన్నారదీయం ఆరాశ్వాసాలకు మాత్రమే - అంటే సంస్కృతంలో నారదీయమహాపురాణ ప్రథమపాదానికి మాత్రమే పరిమితమై వున్నందువల్ల మృత్యుంజయకవి నారదీయమహాపురాణాన్ని పరిపూర్ణంగా అనువదించాడో లేదో చెప్పలేము. మృత్యుంజయకవి పూర్ణానువాదమే చేసివుంటే సప్తమాశ్వాసాదిగా గల గ్రంథం మనకు లభ్యం కాలేదని భావించవలసి వుంటుంది. మృత్యుంజయకవి ఆరాశ్వాసాల తరువాత మిగిలినభాగాన్ని అనారోగ్యాదికారణాలవల్లకాని, అకాలమరణంవల్లకాని విరచించి వుండకపోవచ్చునని ఊహించవలసి వున్నది. అయితే మృత్యుంజయకవి రచించబూనిన ఆరాశ్వాసాలగ్రంథంగా రచించిన బృహన్నారదీయపురాణం మాత్రం అసలు సంస్కృత నారదీయమహాపురాణాన్ని, అంటే యిప్పుడు మనకు ముద్రితమై లభ్యమౌతున్న నారదీయమహాపురాణాన్ని అనుసరించి అనువదింపబడిందనడం యథార్థం. ఈ మృత్యుంజయకవి క్రీస్తుశకం 17వ శతాబ్దంలో వున్నట్లు కనిపిస్తున్నది.

అల్లాడు నరసింహకవి కృతమైన తెలుగు నారదీయపురాణం యెనిమిది ఆశ్వాసాలతో 2317 గద్యపద్యాలతో వున్నది. మద్రాసులోని ప్రాచ్యలిఖితపుస్తక