పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నతని పుత్రులైన యజ్ఞమాలి సుమాలులు మోక్షంబు నొందుటయు, నుదంకమాహాత్మ్యంబును, జయధ్వజుఁ డనురాజు చరిత్రంబును, నింద్రసధర్మసంవాదంబును జతుర్యుగధర్మంబులును, కీర్తితంబు లయ్యె."

ఈపైన పేర్కొన్న విషయాలన్నీ మొత్తం అసలు నారదీయమహాపురాణానికి అనువాదగ్రంథంగా అవతరించనున్న విషయాలతో కూడిన బృహన్నారదీయపురాణవిశేషాలుగా కనిపిస్తున్నాయి. ఈ పైవచనంలో సూచితాలైన విషయాలన్నీ మృత్యుంజయకవి రచించిన ఆరాశ్వాసాలకృతిలో యిమిడివున్నాయి. అయితే యీ ఆరాశ్వాసాలలోనూ వర్ణంచబడిన విషయాలను, సంస్కృత నారదీయమహాపురాణంతో సరిపోల్చి చూస్తే యివి సంస్కృతపురాణంలో ప్రథమపాదంలోని 41 అధ్యాయాలకు మాత్రమే పరిమితమై వున్నట్లు స్పష్టపడుతున్నది. అయితే బృహన్నారదీయ ఆశ్వాసాంతగద్యలలో "మృత్యుంజయనామధేయప్రణీతంబైన బృహన్నారదీయంబను మహాపురాణంబునందు" అని బృహన్నారదీయం మహాపురాణగ్రంథంగా విస్పష్టంగా వక్కాణించడం జరిగింది. కాని మృత్యుంజయకవి రచనగా లభించిన ఆరాశ్వాసాలగ్రంథమే సంపూర్ణగ్రంథం అయ్యేట్లైతే అది సంపూర్ణనారదీయమహాపురాణం కాజాలదు. అవతారికలో మృత్యుంజయకవి రచించిన "నే నాంధ్రభాష రచియింపఁబూనిన బృహన్నారదీయంబునకు నాఖ్యాయికాప్రకారం బెట్టిదనిన, నిప్పురాణంబునందు వివరింపనైన యవి యాలకింపుడు." అన్నవాక్యం సరిగ్గా మృత్యుంజయకవి రచించినట్లుగా యథాతథంగా వున్నదో? లేదో? చెప్పలేకుండా వున్నాము. కేవలం ఒకమహాపురాణంలోని ప్రథమపాదవిషయానికి మాత్రమే తనఅనువాదకృతిని పరిమితం చేసి, దాన్ని సంపూర్ణమహాపురాణంగా మృత్యుంజయకవి పేర్కొంటాడని మనం భావించలేము. అవతారికలో పేర్కొన్న "నే నాంధ్రభాష రచింపఁబూనిన" ఇత్యాదివాక్యంలో "నిప్పురాణంబునందుఁ బ్రథమపాదంబునందలి వివరింపనైనయవి యాలకింపుడు" అని మృత్యుంజయకవి కేవల ప్రథమపాదవిషయాలను మాత్రమే వివరించాడా! ఆరాశ్వాసాల తరువాత సప్తమాశ్వాసప్రారంభంలో ద్వితీయపాదవిషయాలను యిదేవిధంగా క్రమానుగతంగా అనేకాశ్వాసాలతో కూడిన బృహన్నారదీయపురాణంలో పాదాత్మకంగా విషయాలను విభజించి మృత్యుంజయకవి విషయానుక్రమణికను పేర్కొనదలచాడా! అని అనిపిస్తున్నది. అయితే యీసందర్భంలో 'ప్రథమపాదంబునందలి' అన్నపదాలను అసలు మృత్యుంజయకవి బృహన్నారదీయకృతికి ప్రతి వ్రాసిన వ్యక్తులు విడిచిపెట్టి వుంటారని మనం భావించవలసి వుంటుంది. కాని యీ అభిప్రాయానికి వొకవిప్రతిపత్తి సైతం లేకపోలేదు. ఒకసంస్కృతమహాపురాణాన్ని తెలుగులోకి