పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుట్టుటయు, సగరుం డశ్వమేధంబు సేయ నుపక్రమించి విడిచిన యశ్వంబును నింద్రు డెత్తుకొనిపోయి పాతాళంబున కపిలసన్నిధానమున నునుచుటయు, సాగరు లరువదివేలును నచ్చటికిం జని కపిలుని కోపంబున నిహతులగుటయు, నంశుమంతుం డచ్చటికిం జని కపిలానుగ్రహంబున నశ్వంబు గొనివచ్చి యాగపూర్తి గావించుటయు నయ్యంశుమంతునకు దిలీపుండును, దిలీపునకు భగీరథుండును జన్మించుటయు, సాదాసుండను రాజు వసిష్ఠుశాపంబున రాక్షసత్వంబు నొంది గంగాజలక్షణమాత్రస్పర్శంబున శాపవిముక్తుం డగుటయు, బలి మహాదైత్యుండు దేవ, స్వర్గంబు మొదలైన దేవపదంబులు తా నాక్రమించి ప్రబలుండై యున్న యతని భంగించుటకై యదితి తపంబు చేసిన, యాయమకు హరి ప్రత్యక్షంబై తద్గర్భంబున వామనాకారంబున జనియించి, బలి యింటి కరిగి తక్షణంబ త్రివిక్రమాకారంబున సకలలోకంబులు నాక్రమించు నవసరంబునఁ దదీయాంగుష్ఠంబు సోకి బ్రహ్మాండంబు భిన్నంబై తద్వారంబున బాహ్యజలంబు ప్రవహించిన నది గంగ యనం బ్రసిద్దం బగుటయు, నంత బలిని బంధించి పాతాళంబున కనిచి, దేవతలకు రాజ్యం బిచ్చి వామనుండు తపంబు సేయ నరుగుటయు, దానప్రతిగ్రహంబుంయందు పాత్రాపాత్రంబులు వివరించుటయు, యముండు భగీరథుండను రాజుం జూడ వచ్చి యతనికి పుణ్యంబులు తత్ఫలంబులైన స్వర్గాదిభోగంబులు, పాపంబులు తత్ఫలంబులైన నరకయాతనలు చెప్పుటయును, నంత భగీరథుండు గంగావతరణనిమిత్తంబు శీతాచలంబునందు తపంబు సేయందలచి చనుచు, నానడుమ భృగుమహామునిం జూచి యతనివలనఁ గొన్నిధర్మంబులు దెలుసుకొని యంత నతనిచేత ననుజ్ఞాతుండై చని నాధేశ్వరం బన్న క్షేత్రంబున దపంబు సేయుటయు, నతనికి విష్ణుండు ప్రత్యక్షంబై మనోరథంబు ఫలియించు శివుని నారాధించుమని చెప్పిన నతం డట్లు చేసిన హరుండును బ్రసన్నుండై జటాజూటంబున నున్న గంగను భగీరథున కిచ్చిన నమ్మహానదియు నతనివెంటం జని, సాగరభస్మరాసులపైఁ బ్రవహించిన, వారందరు నూర్ధ్వలోకంబునకుం జనుటయు, ద్వాదశివ్రతమహాత్మ్యకీర్తనంబును, బూర్ణిమావ్రతప్రశంసయును, ఇతిహాసయుక్తంబైన ధ్వజారోపణవ్రతకథనంబును, హరిపంచకప్రకాశంబును, మాసోపవాసవ్రతలక్షణంబు ప్రకటించుటయు, నేకాదశీవ్రతసమాచరణంబు నితిహాసపూర్వకంబుగా నుగ్గడించుటయు, వర్ణాశ్రమాచారంబులు దెలుపుటయు, పితృకార్యప్రకారంబును, తిథినిర్ణయంబును ప్రాయశ్చిత్తవిధానంబులును, యమపురమార్గంబు వివరించుటయు, జీవులు భూలోకంబునకు వచ్చి నానావిధశరీరంబులు ధరియించుచందంబును, యోగలక్షణంబు తేటపరచుటయు, హరిభక్తిమహిమంబును, వేదమాలిచరితంబును