పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని తనను గురించి తాను పేర్కొని ఆ తరువాత తాను రచింప బూనిన బృహన్నారదీయం గురించి యీ క్రిందివిధంగా ఉటంకించినట్లు కనిపిస్తున్నది.

"నేనాంధ్రభాష రచియింపఁబూనిన బృహన్నారదీయంబునకు నాఖ్యాయికాప్రకారం బెట్టిదనిన నిప్పురాణంబు నందు వివరింపనైన యవి యాలకింపుడు.

నైమిశవనవాసులైన మహామునులు ధర్మార్థకామమోక్షసాధనోపాయంబు లడుగ శౌనకు నొద్దకుఁ జనుటయు, నతండు అమ్మునులతోఁ గూడ సిద్ధాశ్రమంబున నున్న సూతుం జూడ నరుగుటయు, నా సూతునితోడఁ దమరు వినందలఁచిన యర్థంబు లడుగుటయు, నతండు నారదసనత్కుమారసంవాదంబైన బృహన్నారదీయంబను పురాణంబు చెప్పందలచి తన్మహత్వంబు గొనియాడుటయు, మేరుశృంగంబున నారదసనత్కుమారసంయోగంబును, సనత్కుమారుడు తమకు వినం దగిన యర్థంబులు నారదు నడుగుటయు, నారదుం డనేకప్రకారంబుల హరిం బ్రశంసించుటయు, సృష్టిప్రకారంబును, భారతవర్షమాహాత్మ్యంబును, భక్తిప్రశంసయు, నాచాప్రశంసయు, మృకండు మహాముని తపంబు సేయుటయు నాతపంబునకు వెరచి దేవత లందరు హరిశరణంబు వేడుటయు, వారి కతండు ప్రత్యక్షంబై యభయం బిచ్చుటయు, నద్దేవుండు మృకండునికి సాక్షాత్కారం బగుటయు, హరి తాన మృకండునకు కుమారుండనై పుట్టెదనని వరం బిచ్చుటయు, మార్కండేయసంభవంబును, నతని కచ్యుతుండు సకలపురాణసంహితలు దెలుపుటయు, నేకార్ణవంబున హరి పవ్వళించుటయుఁ, గాలప్రమాణపరికీర్తనంబును, మార్కండేయమహామునికి సర్వేశ్వరుండు భాగవతలక్షణం బానతిచ్చుటయు, గంగామహాత్మ్యంబును, హరిహరభేదరాహిత్యంబును, పురాణశ్రవణ గంగా గాయత్రీ తులసి భక్తివిశేషంబులును, బాహునృపతి భూపాలనంబును, నతని కహంకారంబు ప్రవేశించుటయు, హైహయులకు నోడి బాహునృపతి భార్యాసమేతంబుగా వనంబున కరుగుటయు, నతని పత్నికి శత్రువులు గరళంబు వెట్టుటయు, వారు కార్వాశ్రమంబు ప్రవేశించి యుండుటయు, నచ్చట బాహునృపతి మరణంబును, గర్భిణియైన తత్పత్ని యనుగమనంబు సేయు తలం పెరింగి వచ్చి యౌర్వముని వారించుటయు, నక్కాంతకు సగరుండను కుమారుండు పుట్టుటయు, నతం డౌర్వునివలన సకలశాస్త్రంబులు చదివి ప్రబుద్దుండై శత్రువులపైఁ జని మహాయుద్ధంబు చేసి వారల వధించి నిజరాజ్యంబు చేకొనుటయు, సగరుండు నిద్దరభార్యల వివాహం బగుటయు, నొక్కభార్యకు నరువదివేవురు పుట్టుటయు నొకర్తెకు వంశకరుండైన సుతుండొకడు పుట్టుటయు, నా యరువదివేవురును జగతులకు బాధ గావించుటయు, ననమంజసుఁడను నేకపుత్రునకు నంశుమంతుండు