పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/655

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


బొసంగి రక్షించు, దైత్యులకు గోబ్రాహ్మణులు విష్ణుపరమపదనిధా
నంబుఁ దెలుపు సిద్ధాంజనంబు మూర్తులు; గోబ్రాహ్మణుల ని ట్లెఱుంగని
వాఁడు నిర్విషాణపశు వనిన విని హిరణ్యకశిపుం డాగ్రహించి
వెడనవ్వు నవ్వి యిట్లనియె.

77


మ.

అవురా! యెంత మహాద్భుతం బిది! ఘనుం డస్మత్కులాంభోధిసం
భవుఁ డీబాలుఁడు తా బిడాల మెలుకన్ బ్రార్థించినట్లన్, భుజం
గవితానంబు మయూరముం బొగడురేఖన్, శ్రీమనోనాథు ను
త్సవలీలన్ వినుతించ నిట్టిదియె మందత్వంబు దుర్బుద్ధియున్.

78


క.

మత్సుతుఁడ వయ్యు నీవు ని
రుత్సవమతి నజ్ఞునట్ల యుండి, విహీనా
స్మత్సేవకుల నుతించెదు
మత్సాహసధైర్యశౌర్యమహిమలు వినవే?

79


క.

వాయసము చూతవనమునఁ
బాయక వర్తించి నింబఫలకాంక్షకునై
యాయడవిఁ దిరిగినట్లున్
బాయునె హరి నెఱుఁగుదువె దురాత్మక! యనుచున్.

80


సీ.

మనకు నీహరినుతి వినుట యుక్తమై? యెందు
                       నున్నవాఁ డాహరి? యోరి! తంతు
జాలంబు లేకయ, చేలంబు నేసిన
                       గతి, నభిత్తిని చిత్రకర్మకలన
గావించినట్టులు, గగనపుష్పము సౌర
                       భాఘ్రాణ మొనరించునట్టుల, నిర్వి
షయుఁడైన శ్రీహరి సన్నుతించెదవు శి
                       శుత్త్వంబు నొంది యశుద్ధబుద్ధి;


తే. గీ.

సూక్ష్మదృష్టుల మాహరిఁ జూడ; మల్పుఁ
డెవ్వరుఁ డెఱుంగు మాకంటె? నీదురుక్తి
విడువు మని నింద సేయు నావిభుని గాంచి
జ్ఞానపాథోధియైన యాసూనుఁ డపుడు.

81