పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/654

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నాకంటె నాతఁ డధికుండని నీ కేద్విజులు బోధించిరి?
దోడ్కొని తెమ్ము, భాషించెద; విష్ణుం డెట్ల యట్లనే సర్వోత్కృష్టుండ,
నతని విడిచి నిజకులోచితశౌర్యంబు వహించి, యోరి! సింహ
కిశోరంబ! దేవమృగవ్రజంబులతో నుండ నర్హంబె నీకు? నీపౌరు
షంబు చూపు మనిన నంజలిచేసి ప్రహ్లాదుండు తండ్రి కిట్లనియె.

75


సీ.

దైత్యేంద్ర! యిన్నియుఁ దగుఁ ద్రిజగజ్జయ
                       సంపద నీకు; నోస్వామి! నేడు
ప్రాకృతుండవు నీవు పరమాత్మయైన యా
                       హరి నిజాంశంబున నవతరించి
యిట్ల యుండకయున్న నీశౌర్య మీశక్తి
                       యీమహైశ్వర్యంబు నేల కలుగు!
నిది వితర్కింపక యేల పల్కితివి బ్రా
                       హ్మణగోష్ఠి విడుమని యనృతభాష?


తే. గీ.

యంధతమసబిలము చొచ్చునపుడు దీప
మెట్లు దిగనాడవచ్చు? సమిద్ధమత్స
రాన్వితద్వేషమున నిట్టులాడఁదగునె
యకట నీ కిది ధర్మమే యసురనాథ!

76


వ.

సన్మార్గదర్శనంబునకుం దనకన్నులు దానె చెఱచుకొనినవాఁ
డమృతాస్వాదఫలం బగు సాధుసంగంబు విడిచినవాఁడు; భవోద్దీపనా
నలంబైన ఖలసంగంబు నొందవచ్చునే? విష్ణుండు సర్వమయుం
డగు నందునేనియు ద్విజులు ప్రధానతనువులు; వారి విడిచి వృథా
జన్మంబు గావించుకొనం దగునే? గోబ్రాహ్మణులు పరదేవతలు;
హవిర్మంత్రస్వరూపు లొకచో మంత్రంబు లుండు. ఒకచో
హవిష్యంబు లుండు. విష్ణుశక్తి బ్రాహ్మణాధారంబు. సమస్తజగ
దాశ్రయం బైనయది. విప్రుల నాశ్రయించి దేవయోనులు బ్రతుకుదురు.
దేవతల కేని పరదేవతలైన బ్రాహ్మణులకు నెవ్వఁడు వందనంబు
సేయండు? బ్రాహ్మణులు జగద్రధంబు నడువ నక్షంబు లైనవారు.
మ్రొక్కినఁ బూజించినఁ దలంచిన రక్షింపుదురు. నరులకు
గోబ్రాహ్మణులకంటె దృష్టాదృష్టహితంబు లేదు. దర్శనస్పర్శన
కీర్తనంబులచే గోబ్రాహ్మణులు పాపంబులు హరింపుదురు. నిత్యోప
పాపాగ్నినవశులైన జనుల నీలోకంబులు మ్రింగవే గోబ్రాహ్మణులు
వారింపక యున్న భవవ్యాధిక్లిష్టులైనవారికి దివ్యజ్ఞానౌషధం