పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/651

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

స్థావరక్రిమిజలచరపక్షిపశునర
                       దేవధర్మాత్మముక్తిపరజాతి
క్రమమున నెంచఁగఁ బ్రథమంబు లవి ద్వితీ
                       యంబులకన్న సహస్రభాగ
సమధికంబులును సూక్ష్మంబులు సూక్ష్మసూ
                       క్ష్మంబులు సూక్ష్మతరంబు లట్ల
సుస్థూలములు స్థూలసుస్థూలములునునై
                       స్థూలతరంబులు లీల మెఱయు


తే. గీ.

కర్మబంధనిబంధనోత్కటములైన
ప్రాణు లుండనిచోటు [1]విశ్వంబునందుఁ
గలదె యంగుళికాష్టమకళయునైన
నిర్ణయించిన నీధరణితలమున.

63


వ.

దేహాంతరంబునఁ గొన్నియాతనల నొంది దేవనరపశుపక్షితిర్య
క్స్థావరత్వంబులు గాంతురు. వాచికకర్మదోషంబునఁ బశుత్వమృగ
త్వంబులును, మానసికకర్మదోషంబున నంత్యజత్వంబును, శారీర
కర్మదోషంబున స్థావరత్వంబు నొందుదురు మఱియు.

64


సీ.

అతిభయంకరులైన యమకింకరులు క్రోధ
                       తామ్రాక్షులై వేగఁ దారసిల్లఁ
గని వివశత నొందఁగా వారు యాతనాం
                       గంబులో నిల్పి దుష్కర్ముగళము
కఠినపాశంబులఁ గట్టి యీడిచి తెచ్చి
                       రాజభటులు సాపరాధులఁబలెఁ
దూరించి సంతప్తతాలుకాన్వితకాప
                       థంబున నడిపింపఁ దాప మంది


తే. గీ.

యపుడు క్షుత్తృష్ణ లుదయించ నతికశాప్ర
హారములు వీఁపుపై నొడ నత్యశక్తి
నిర్జరస్థలముల వెంట నిలువనీక
తరుముకొనిపోవ మూర్చిల్లి తేరితేరి.

65
  1. లోకంబునందు