పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/652

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

ఒనర నవతి నవసహస్రయోజనాధ్వ
ముద్ధతంబుగ మూఁడుముహూర్తములను
శమనభటు లిరువురు మహాసాహసికులు
యమనివాసంబుఁ జేర్తురు యాతనలకు.

66


సీ.

నిబిడోల్ముకచ్ఛటనిజమాంసచయముఁ గా
                       వించి యుగ్రతఁ దినిపించి రొక్క
యెడ నొక్కరునిచేతఁ దొడిమడ నొసఁగించి
                       రుగ్రమహార్భటి నుగ్రలోహ
ముఖగృధ్రములచేత ముహురాంత్రకృంతనం
                       బొనరించి, రధికమహోగ్రసర్ప
వృశ్చికదంశాదివివిధదంశనముల
                       వేదన అందించి, ద్విపమహీధ


తే. గీ.

రాగ్రపాదంబుగాఁ ద్రోఁచి రంబుగర్త
రుద్ధులం జేసి యాయుధవిరుద్ధులైన
విడువ కంతంత బాధించి వేగఁ గనలి
శమనదూతలు దుర్వారశక్తి మెఱసి.

67


వ.

తమిస్రాంధతామిస్రరౌరవాదులైన యాతనల నరులనేని, నారుల
నేని యన్యోన్యసంగదోషంబునం బొందితు రటుగాన సర్వ
జగత్పూర్ణుండైన భగవంతుని భజించిన సకల దోషంబులు నణంగు
మఱియు.

68


క.

పలుకుట కుడుచుట కట్టుట
నిలుచుట తిరుగుట సుఖించి నిద్రించుట, లో
కులకు హరిప్రేరణమునఁ
గలిగినయవి కాని వేఱె కలుగవు తండ్రీ!

69


వ.

కావునఁ దామసబుద్ధి విడిచి పూర్వంబునం జేసిన హరిపూజనంబుల
లభించిన మహైశ్వర్యం బనుభవింపుచున్నప్పుడుం బూజింపుము.
కృతఘ్నుండవు గాకుము. సర్వేశ్వరకల్పితస్వభావంబు విడువ
శక్తుండు లేఁడు గానఁ దండ్రియేని గురుండేని యహిదంష్ట్రాగ్రంబు
పయి వ్రేలు చాపిన వారింపవలయునని న్యాయంబునం బలికితి,
నీయపరాధంబు క్షమింపు మని పాదంబులం బడినఁ దద్దైత్యపతి
యిట్లనియె.

70