పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/649

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వాఁడ? నేరూపంబువాఁడ? నేబంధంబున బద్ధుండ నైనవాఁడ?
కారణం బెయ్యది? కార్యం బెయ్యది? యకార్యం బెయ్యది?
వాచ్యం బెయ్యది? యవాచ్యం బెయ్యది? ధర్మం బెయ్యది? యధర్మం
బెయ్యది? కర్తవ్య మెయ్యది? యకర్తవ్య మెయ్యది? గుణదోషంబులు
గలయది యెయ్యది? యని తెలియక శిశ్నోదరపరాయణుండై
కార్పానబీజంబుతంతు కారణపక్షాఘంబులచేతంబోలె నానా
దుఃఖంబులచేతం బరిఫ్లుతుండై యుండు. యౌవనంబున నర్థార్జన
దుఃఖంబుల నర్థావనదుఃఖముల నృపాలాదులచేత నర్థవ్యయదుఃఖం
బులం బొరలుచు వ్యర్థోద్యోగంబు నంది యణంగుచు నుండును.

54


క.

పుత్రకళత్రక్షేత్రసు
మిత్రధనాద్యములచేత మెలఁగిన సుఖముల్
చిత్రముగ నున్న కైవడిఁ
బాత్రములే ధర్మసౌఖ్యభాగ్యక్రమముల్.

55


సీ.

ఈభవంబులయందు నెన్నెన్నియోనుల
                       జనియించు విగతవిజ్ఞానుఁ డగుచు
నలరి తత్తద్యోనులందు వైరాగ్యంబు
                       నందండు సుఖముగా ననుభవించు
నరకంబులోపల నలఁగి దేహముమీఁది
                       యాస మానఁడు నిరాయాసబుద్ధి
నాత్మజాయాతనయాగారపశుధన
                       ద్రవిణబాంధవమైత్రిఁ దగిలి యాత్మ


తే. గీ.

యందుఁ దను మెచ్చుకొనుచు నత్యంతదురిత
కోటు లొనరించుకొనుచు దుష్కుంఠితాత్ముఁ
డగుచు సంసారచక్రంబునందుఁ దిరుగు
మానవుఁ డగమ్యతరదేవమాయకతన.

56


తే. గీ.

ఆత్మలో దారపుత్రధనాదిమోహ
ములు మహాదుఃఖతరబీజములు చెలంగి
తనువు భేదించి వెడలి చేతనుని బ్రాయ
మునఁ దపింపఁగఁ జేయు నమోఘశక్తి.

57