పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ద్రిప్పుచు నున్నవాఁడు. తదీశ్వరశక్తిం బాసి నిమేషోన్మేషంబుల
యందేని సమర్థుండు గాఁడు. నీ వసాధువచనంబులు వినక సర్వేశ్వ
రుని వేఁడుకొనుము. పూర్వపాపంబు లేనియుం దొలంగు.
ఈయైహికంబు సుఖంబుగాఁ గోరుచున్నవాఁడవు. తద్దుఃఖం
బెఱింగించెద.

52

ప్రహ్లాదుఁడు తండ్రికి భవదుఃఖస్వరూపం బెఱింగించుట

సీ.

కేవల బహుమలాకీర్ణమౌ జననిగ
                       ర్భంబున సౌకుమార్యము వహించి
యుల్బంబులో స్రుక్కియుండి సంభుగ్నక
                       రాస్థిపృష్టాధికుం డగుచు మర్త్యుఁ
డత్యామ్లకటు[1]సుతీష్ణాక్షాత్యుష్ణలవణంబు
                       లగు తల్లి భుజియించు నట్టి [2]భోజ
నముల వేదన లంది నలఁగి నిజాంగప్ర
                       సారణాకుంచనశక్తి లేక


తే. గీ.

యనిశమలమూత్రపంకలిప్తాంగుఁ డగుచు
జన్మశతములచైతన్యసరణిఁ దలఁచి
పరితపించుచు నిజకర్మబంధనమున
గర్భదుఃఖంబు గాంచు నగ్రంబునందు.

53


వ.

ప్రాజాపత్యవాతపీడ్యమానాస్థిబంధనుండై ప్రబలసూతిమారుతంబులచే
నధోముఖుండై క్లేశంబున మాతృజఠరంబు వెడలి మహామూర్ఛ నొంది
బాహ్యవాయుసంస్పర్శంబున విజ్ఞానభ్రంశంబు నొంది శరీరంబు
కంటకంబులం బొడిచిన యట్లు, క్రకచంబులం జీరిన యట్లు వేదన
లంది పూతివ్రణంబులతోఁ గ్రిమియుంబోలె ధరణిం బడి కండూ
యనపరివర్తనంబులయందు నసమర్థుండై స్నానపానాదికంబుల
యందేని పరేచ్ఛంగాని తాఁ జేయ నశక్తుండై కీటదంశాది
బాధల నొందియు వారించుకొన దక్షుండు గాక పొత్తులపయిం
బవళించి దుఃఖంబు లనుభవించు బాల్యంబున మూఢాంతఃకరణుండై
యజ్ఞానతమశ్ఛన్నుండై యే నెవ్వండ? నెచ్చటికి నేఁగుచున్న

  1. సుతీష్ణలవణంబులగు
  2. వస్తుభోజ