పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/646

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

హరి భజించుట దుష్కరం బని యుపేక్ష
సేయువాఁ డతినీచుండు శ్రీవిభుండె
యంతరాయంబు లణఁగించు నమ్మహాత్ము
శరణ మని కొల్వఁ బ్రాపించుఁ బరమపదము.

37


క.

శ్రద్ధాతిశుద్ధభావని
బద్ధాచ్యుతభజనశుద్ధి ప్రాపించి యఘా
నద్ధాంతరాయములు చను;
నిద్ధమహాదీపశిఖల నేగవే తమముల్?

38


వ.

అని మఱియు నిట్లనియె.

39


ఉ.

నాలుక గల్గియుం దురితనాశనకారణవిష్ణుకీర్తన
శ్రీలు వహింపఁ డెవ్వఁ డసుశీలుఁడు వాఁడు; విముక్తసౌధరా
ట్కేలికి నెక్క నిచ్చెన యకించిదుదారతఁ గల్గ నెక్కఁ డే
బాలిశుఁ డట్టి మూఢుని నపాయరతుం దలఁచంగఁ బాపముల్.

40


తే. గీ.

కాన గోవిందమాహాత్మ్యకథల యందు
నిరుపమానంద మొంది వర్ణించి సన్ను
తించి నర్తించినట్టి యానియమపరుఁడు
పరమభక్తుండు ఘనుఁడు సద్భాగవతుఁడు.

41


క.

జలజాక్షభక్తులం గని
పులకాంకురములు వహించు పురుషున కవియే
వెలలేని వజ్రకవచము
నలుగడ దురితాస్త్రచయము నాటునె వానిన్.

42


క.

హరిదివ్యకథాశ్రవణాం
తరమున నానందబాష్పధారలు వడి యాం
తరతాపత్రయదహన
స్ఫురణంబులు మాన్పు నెట్టి పురుషులకైనన్.

43


వ.

అని యప్పుడు ప్రహ్లాదుండు భక్త్యాహ్లాదంబునం బలికిన భగవత్ప్ర
భావంబు విని హిరణ్యకశిపునకు భగవదిచ్ఛవలన రజస్తమోద్రే
కంబున గర్వోత్సేకంబు వొడమునంత.

44