పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

గాంచి సర్వైకవంద్యభాగ్యము వహించి
మత్ప్రసాదంబువలన ధర్మగుణశీల
యైన మీతల్లి వరనీతి యాసునీతి
గారవించంగ నిఖిలవిఖ్యాతి నుండు.

30


మ.

అని లాలించి నిజాలయంబునకు నత్యంతప్రసన్నైకహృ
ద్యనిరీక్షన్ నిజదాసుఁ దా మరలి యత్యాసక్తి నీక్షింపుచున్
జన మింటన్ సురసిద్ధసాధ్యవరు లంచత్కల్పభూజాతనూ
తనసూనంబులు భోరునం గురిసి రుద్యద్భక్తిమై నంతటన్.

31


క.

పరమపద మందె నీగతిఁ
బరమానందమున ధ్రువుఁడు; పరమాత్మ కృపా
పరుఁడై ప్రసన్నుఁ డైనన్
గరము ననాశాస్యవస్తుగణములు లేవే!

32

ప్రహ్లాదుఁడు తండ్రికి భగవత్ప్రభావం బెఱింగించుట

ఆ. వె.

హరి ప్రసన్మమూర్తి యగుట ననేకవి
ఘ్నములు గలవు భజనకాలముననె
యలసతయును నిద్ర యతిభయంబులును గా
మాతురతయు మదము నాదిగాఁగ.

33


క.

తరియింపరావు విఘ్నాం.
తరములు హరిభజనవేళ; దర్వీకరశే
ఖరమస్తకరత్నమువలె
దొరకునె సుకృతులకుఁ గాక దుర్లభము లిలన్.

34


క.

అరయఁగఁ గ్రోధాదులు శ్రీ
హరికల్పమహీరుహమున కావరణంబుల్
దొరకంగ నీవు వానిన్
నిరసించిన యట్టిభాగ్యనిధికిం దక్కన్.

35


క.

అరిషడ్వర్గమహాఫణి
పరిగుప్తదురాపచక్రపాణినిధానం
బురువిద్య నొందువారిన్
నిరతము సేవింతు నిత్యనిర్మలు రగుటన్.

36