పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/643

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నున్న చతుర్భుజబ్రహ్మంబుఁ గాంచి యేమి సేయుదు నెట్లు వినుతింతు
నెట్లు సేవింతు నని యూరకయుండి హర్షాశ్రుపూర్ణుండై 'స్వామీ!
ప్రసన్నుండవు గ'మ్మని యతిప్రయాసంబునం బలుకుచుండి దండ
ప్రమాణం బాచరించి వణుకుచుఁ బులకించియున్న యతనిఁ గరంబుల
నెత్తినఁ దత్సంస్పర్శహర్షోవచయంబున స్తవశక్తి గొంత మెఱయ
మూర్తి [1]మద్వాగ్‌జ్ఞాననిభంబైన శంఖంబున నమృతబిందువు
దొలంక ముఖమార్జనంబు గావించిన మున్నే విమలంబైన చిత్తంబునఁ
ద్రిభువనగురుశంఖచక్రస్పర్శజన్యజ్ఞానభానుండు స్ఫురింప నిట్లని
వినుతించె.

27


సీ.

జయ జయ లసమానశంఖచక్రాసిశా
                       ర్ఙ్గగదా[2]గ్రహణభుజాగ్రప్రధాన
జయ జయ నిజదానజనయోగ్యబహుకామ
                       భువనత్రయమయసంపూర్ణవిభవ
జయ జయ సర్వాత్మసంభూతభావజ్ఞ
                       సర్వశరణ్యశాశ్వతవరేణ్య
జయ జయ దైత్యభంజనఘనప్రకృతిపూ
                       రుషకాలసంయుక్తరూపనాథ


తే. గీ.

ఒక్కరుఁడ వీవె నిఖిలలోకోదయావ
నాంతకారణమైన మహామహుండ
వొక్కరుఁడ వీవె సకలలోకోత్తరుఁడవు
కలితశుభమూర్తి యెంచ నొక్కరుఁడ వీవె.

28


వ.

ఇది గాన నీతత్త్వంబు నెవ్వ రెఱుంగుదురో స్వామీ! యవికృత
నిజరూపుండ వగుట నీకు వివిధభావము మాయచే విరుద్దంబు
గాదు, దినకరకరజాల[3]మూషరస్థానసంగంబున నవికృతమేనియు
నిజరూపవికారంబు వహించునట్లు నీరూపంబు వైకృతంబును
గారణంబు నన వినంబడియె. ఆవైకృతరూపము జగత్తని వేదంబులు
పలికె. కారణం బగు నవి బ్రహ్మమును, సత్తు నని విన్నవించు; నట్టి
దేవవంద్యంబులైన యీరెండురూపంబులు భజించెద. విశ్వమూర్తీ!
నిన్ను వేదంబులు దశశతముఖునింగా, సహస్రాక్షిపాదునింగాఁ
బలికె. మఱియును సహస్రముఖపాదాక్షి, బాహురునింగాఁ బలికె.

  1. మవాగజ్ఞాన
  2. గ్రణి
  3. మూషక