పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/638

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నారదీయపురాణము

అష్టమాశ్వాసము

క.

శ్రీమాన్యజాంబవత్క
న్యామానసరాజహంస! హంసోత్తంసా
రామవసంతగుణాశ్రయ!
సోమాన్వయవరవిభూష! శోభనవేషా!

1


వ.

అవధరింపుము. సూతుండు శౌనకాదులకు హరికథాసుధావ్రవా
హంబు వెల్లివిరియ నిట్లనియె ననిన వారలు నిజశాస్త్రధౌరంధర్య
ప్రాగల్భ్యంబున వచ్చి నిలిచిన యప్పుడు.

2


క.

పూర్ణబ్రహ్మానందో
దీర్ణ పరంజ్యోతిరిద్ధతేజోమహిమా
కీర్ణ శుభాకారశ్రీ
నిర్ణిద్రస్ఫూర్తి సుతుఁడు నిలిచెన్ సభలోన్.

3


వ.

నిలిచి.

4


సీ.

పాషండమతగర్వపర్వతంబులమీఁద
                       దంభోళియై మహోద్ధతి వహించి
చార్వాకమతమహాసాగరావళిమీఁద
                       నౌర్వానలస్పూర్తి నాక్రమించి
బౌద్ధదంతావళోద్భటఘటార్భటిమీఁద
                       సింహరాజంబుప్రసిద్ధి నెదిరి
జైనమహారణ్యసంఘాతముల మీఁద
                       నతులదావానలంబై స్ఫురించి


ఆ.

కపిలాక్షపాదకాణాదవైరించ
మతఘనాంధతమసమండలార్క
మండలప్రకాండఖండనోద్దండత
నట జయించె నా[1]కయాధసుతుఁడు.

5
  1. హిరణ్యకశిపుని భార్య