పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

గురు లానతి యియ్యని యీ
వరవైదికవిద్యయట్ల ప్రాపించెను వ
త్స! రహి వహింపుచు బుధజను
లరయఁగ నిట్లాడ నెట్టు లభిమత మయ్యెన్.

206


తే. గీ.

బాహ్యవాదాభిమానులై బహుసుధీరు
లాగమాంత మంతం బన్న నద్భుతముగ
నింద సేయుదు రది యెట్లు నీకు భోగ్య
మయ్యె వారలకంటె జ్ఞానాధికుఁడవె?

207


క.

కడను బృహస్పతిముఖ్యులు
జడులే వేదాంత మనిన సహియింపరు చొ
ప్పడఁ దద్దోషము లెఱిఁగిరి
విడిచిరి నీ వామతంబు వెలయించెదవే?

208


వ.

అనినఁ బ్రహ్లాదుం డిట్లనియె.

209


సీ.

దైత్యేంద్ర నమ్ము మద్వచనంబు ప్రాగ్భవ
                       గురుదత్తమై నిరంకుశత మెఱయ
నీమతి గురుపుత్రు లెఱుఁగ రంతయు శ్రుతి
                       ప్రామాణ్యవిశ్వాసపరత వైది
కాచారరుచియు వేదాంతవేద్యుండైన
                       హరియందు భక్తి యనల్పతపము
నందుఁ గల్గక తా ననాదినిథసంత
                       తానందశాఖియై జ్ఞానపుష్ప


తే. గీ.

మై యమృతరసమై భవ్యమైన వేద
కల్పకము సులభమె దుష్టకల్మషాసు
రప్రకృతులకు నెల్లసారంబు చెలువ
నాత్మ చర్చింపుమా దానవాగ్రగణ్య!

210


క.

శ్రుతి హితకర మని మఱి యా
దృతిఁ బల్కిరి సభలయందు దేవప్రకృతుల్
శ్రుతి యహితం బని పల్కిరి
యతినీచులు లోకవిశ్రుతు లసురప్రకృతుల్.

211