పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/569

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ.

అలఘులు వీతరాగులు శుభాన్వితదేహులు ఖ్యాతిలాభ లా
జలు గొన రామయావిగతశాంతికినై యతిసాధులైన వై
ద్యులువలె భూమిఁ ద్రిమ్మరుచుఁ బూర్ణదయాగుణవారిరాసులై
కలఁగిన జీవకోటి కుపచార మొనర్చుచు బోధసంపదన్.

240


తే. గీ.

మహిమచేఁ బదవాక్యప్రమాణవేదు
లగు మహాత్ము లవజ్ఞ సేయంగ నాసు
రప్రకృతి వార లాత్మసారంబు లేక
వ్రీడమై హరి సద్గోష్ఠి విడిచి యుంద్రు.

241


క.

వామనదితిజాసురర
క్షోముఖ్యసభాంతరములకుం జని వారిం
బ్రేమం గని తెల్పిరి త
త్తామసులకు శ్రుతివిరుద్ధధర్మమతంబుల్.

242


సీ.

ఆకళావిద్యల నసురుల వశ్యుల
                       గాఁ జేసికొని మహాఖలసమాశ్ర
యమునఁ దదిష్టగోష్ఠ్యంతరంబున వారి
                       వలన సత్క్రియ లంది వార లుండి
తావదుత్పన్నదుర్ధరగర్వపర్వత
                       శిఖరసమారోహచిత్రతరమ
హోన్నతులై యిట్లు యుక్తేతరంబులు
                       వల్కుచు మూఢస్వభావు లగుచు


తే. గీ.

నాదిమౌనులు వైదికుల్ వేదనిగది
తారవిశ్వాసదుర్జ్వరాహతమహౌజు
లగుచు ఘనసన్నిపాతంబు లందినట్లు
వింతకల్పన లెల్లఁ గల్పింతు రిలను.

243


వ.

వేదాంతమతమునకంటె నన్యమగు మతము మంచిది గాదని తెలియక
యీవేదాంతమతము నాదరించక యీప్రకారమునను స్వగోష్ఠీనిష్ఠు
లైన ఛాందుసులైనవారి మనస్సులను నల్పులైనవారల నతి
కల్పనులైన మోహంబు నొందించి రప్పుడు.

244