పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


త్మీయత్వసమ్మోహంబు నొంది దేహాదిప్రతికూలానుకూల రాగ
ద్వేషాదివిక్రియలు మఱియు మఱియుం జెందుచు నష్టస్వచేతనోన్న
త్యంబున లక్ష్మీశాజ్ఞోలంఘనాపరాధరూపపాపానురూపంబులైన
దండంబులు గాంచి దుఃఖార్తులై యసుఖంబులయందు సుఖభ్రాంతి
వహించి మరుమరీచికలు గని మృగంబులు పయఃపానేచ్ఛం దిరిగినట్లు
తిరుగుచు దుఃఖైకఫలక్రియలు సేయుచు సుఖంబుం గోరు జంతువులం
గాంచి దుఃఖైకహేతువగు ప్రపంచంబు లయంబు నొందింపఁ జూచి
జలంబున జలబుద్బుదంబునుంబోలె భౌతికంబులు భూతంబుల
యందును భూతంబులు తన్మాత్రలయందును దన్మాత్రలను దామ
సాహంకారమందు నింద్రియంబులను దైజసోర్జితసాత్వికాహంకారము
నందు నహంకారము మహత్తునందు మహత్తు నవ్యక్తంబునందు
నవ్యక్తంబు నక్షరంబునందు నక్షరంబు నజశబ్దవాచ్యంబగు తమ
సంబునందు స్వజ్ఞానశక్తిసూక్ష్మాంగలేశంబు చేతనంబుగాఁ జేసి
బద్ధాసంఖ్యేయచిద్గర్భంబగు తమంబు చూచి పరమవిస్మయంబు
నొంది హరి పరమదయాళుండై సన్నిధి సేవించు నిందిరం జూచి
యిట్లనియె.

218


క.

వలఁ దగిలిన మీనంబులు
వలె జీవగణంబు లాజవంజవజాలం
బులఁ బడి తిరుగం జూచినఁ
గలఁగదె హృదయ మిపు డెట్టి కట్టిడికైనన్.

219


సీ.

తెలివితో వీర లాత్మీయస్వభావ మిం
                       తయుఁ దా రెఱుంగరు తత్వబుద్ధి
దేహేంద్రియప్రాణధీమనోన్వీతులై
                       యున్మత్తు లున్నయ ట్లుండి స్వాను
రూపవృత్తియునైన రూపించఁగా నేర
                       రల ప్రసుప్తులయట్ల విలయ మంది
మణులు దుష్పంకనిమగ్నంబులై నిజ
                       ప్రభఁ బాయునట్లు సౌభాగ్య మెడలి