పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

కులాలుండు ఘటకార్యకర్తయై ప్రత్యక్షప్రమాణంబున దుఃఖంబు
నొందినట్లు విశ్వకర్తయగు నీశ్వరునకుఁ గర్తృత్వంబువలన దుఃఖి
త్వానుమానంబు లేదు. మూర్తంబునకు నంశత్వంబు ప్రత్యక్షంబున
నెవ్వం డనుమానంబు గావించు మానాంతరవిరోధం బైన నొక్కయెడ
సామాన్యానుమానంబు లే దట్లన నీశ్వరునియందు సామాన్యానుమా
నంబు లభించనందునకు శ్రుతియు విష్ణునకు "అపాణిపాదోజ వనో
గ్రహితాపశ్యంత్మ చక్షుః సశ్రుణోనకం సః నవేత్య వేద్యం నచనశ్య
వేత్తా తమాహు రగ్ర్యం పురుషం మహాంతమ్ నకస్య కార్యం కరణం
చ విద్యతే సతత్స మశ్చాభ్యథికశ్చ దృశ్యతే పరాస్యశక్తేర్వివిధైవ
శ్రూయతే స్వాభావికీజ్ఞాన బలక్రియాచ" యనిన నది హస్తంబులు లేక
పట్టును. పాదంబులు లేక పఱువెత్తును. చక్షువులు లేక చూచును.
కర్ణంబులు లేక వినును. అవేద్యంబైన యది యెఱుంగును. తన్నొకం
డెఱుంగలేఁడు. అతండు మహాపురుషుండని యెంతురు. అతనికిఁ
గార్యకరణంబులు లేవు. అతనికి ముందు నధికుండు లేఁడు. అతని
శక్తి వివిధంబైన యదియై స్వాభావికంబులు జ్ఞానబలక్రియలు.
అతని వినుతింప నలవి యగునె. భగవంతుని శక్తు లవాఙ్మానస
గోచరంబులని పురాణంబులం జెప్పంబడియె. ఉత్పత్తిస్థితిలయం
బులయందు సర్వశక్తులు భగవంతునికే కలవు. శ్రుతిస్మృతులే
తదర్థనిర్వాహకంబులై యుండు.

189


తే. గీ.

సత్యసంకల్పవిభవుఁడౌ స్వామియందుఁ
గలుగ డీలోకసామాన్యకల్పనంబు
గాన భగవత్స్వరూప మెక్కడను బొడమ
దెందుఁ గాన్పించఁ డెందుండఁ డెంచి చూడ.

190


మ.

కనునా విష్ణుఁడు కర్ణరంధ్రములచే ఘంటాదిశబ్దంబు లా
ఘనుఁ డేచూడ్కులచే వినున్ సకలవాక్యశ్రేణు లేతత్పురా
తననిర్విశ్వసనీయులై భవముచేతం బ్రాకృతాంగంబు లా
గున భావింపక యప్రమేయమని లోకుల్ చర్చ సేయందగున్.

191


మ.

ఇది వేదాంతరహస్యసారము హరి స్వేచ్ఛానురూపంబు స
మ్మద మొప్పన్ మది నమ్మి పూర్వభవసమ్యక్పుణ్యపాపప్రస
న్నదృఢాభ్యంతరుఁడై విపద్దశలలోనం బాసి సద్భోగసం
పద లింపొంద భజింపుచుండ్రు పరమబ్రహ్మంబు నేకాగ్రతన్.

192