పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

దివ్యోదారవిచిత్రగాత్రులు ఘనుల్ దివ్యోరుగంధాన్వితుల్
దివ్యాచ్ఛాదనదివ్యభూషణయుతుల్ దివ్యస్రగభ్యంచితుల్
దివ్యోద్దండతరాయుధాంకితకరుల్ దివ్యావతంసుల్ విభుల్
దివ్యోపాస్యు శుచిస్మితాస్యు హరి నెంతేఁ గొల్తు రశ్రాంతమున్.

174


మ.

విమలంబై తగు నింద్రలోకనికటోర్విన్ బన్నగారాతిలో
కము తల్లోకమునందు వేదము లుదాత్తాదిస్ఫురస్స్ఫూర్తిగాఁ
గ్రమకుండై పఠియించి పక్షిపతి నిర్యత్సామగానస్వర
క్రమనవ్యామృతధారలం దనుపుఁ దద్బ్రహ్మంబు నశ్రాంతమున్.

175


వ.

తృతీయావరణబహిర్దేశంబున విష్వక్సేనులోకంబు గలదు,
వినుము.

176


సీ.

తనలోకమున నుండి తత్పరమాత్మ ప్రి
                       యప్రభావముఁ గాంచి యతులశక్తి
యుక్తుఁడై యాత్మభుజోపరిన్యస్తేశ
                       సామ్రాజ్య[1]భరితుఁడై ప్రసన్నమహిమ
వైకుంఠపతియొద్ద వాసుదేవాద్యతి
                       శాంతవిఖ్యాతసర్వావరణని
వాసోక్తదేవతావరుల సంసేవింపఁ
                       జేయించు మెఱసి నారాయణాంఘ్రి


తే. గీ.

నిత్యసేవానుకూలతానిరతిశయర
సానుబంధైకహృదయుఁడై యఖిలతత్వ
బోధకుండైన సేనాని పూనియుండు
నరిభయంకరతరవేత్రహస్తుఁ డగుచు.

177


సీ.

పంచావరణలీల భాసిల్లు వైకుంఠ
                       నగరంబునడుమను నతివిచిత్ర
రత్నమంటపమున రమణీయమాణిక్య
                       సింహాసనమును లక్ష్మీవసుంధ
[2]రానీళలు భజింప జ్ఞానబలైశ్వర్య
                       వీర్యతేజచ్చక్తి విమలమహిమ
నిస్సమాభ్యధికుఁడై నిత్యముక్తానంద
                       వారాశిశీతాంశువైభవమున

  1. భరతుఁడై
  2. ళా