పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నేత్రసుముఖసుప్రతిష్ఠితులు నిత్యులు. నిత్యముక్తులతో నీశ్వరు
నారాధింపుదురు. పంచమావరణంబున నింద్రానలదండధరనిరృతి
యాదసాంపతిగంధవాహధనేశానులు నిత్యనిర్జరు లుండుదురు.
ఇది యావరణపంచకంబు.

171


సీ.

చండప్రచండు లుద్దండవైభవులు ప్రా
                       గ్ద్వారపాలురు బ్రహ్మతత్వనిధులు
భద్రసురద్రులు భద్రమూర్తులు దక్షి
                       ణద్వారపాలు రానందనిధులు
జయవిజయులు సత్వసంపద్ఘనులు ప్రతీ
                       చ్యద్వారపాలురు శౌర్యనిధులు
ధాతృవిధాతృ లుత్కటతేజు లుత్తర
                       ద్వారపాలురు మహాధన్యనిధులు


తే. గీ.

వీర లెనమండ్రు సంతతోదారయశు ల
నాదినిధనులు పూర్ణవిద్యాభిరాము
లఖిలసంపత్సమృద్ధంబులైన స్వస్వ
లోకముల నుండుదురు మహోత్సేకములను.

172


సీ.

ఆతతకోటిసూర్యప్రకాశులును గో
                       టీందుకళానందహేతితనులు
సర్వజ్ఞు లుత్తముల్ సత్యసంకల్పులు
                       సర్వాపగుణరూపసారతరులు
హేయనిష్యందరహితులు హేయహార
                       వర్జితుల్ బ్రహ్మవిద్యార్జితామృ
తానందరసవిషయానుభవోత్సవుల్
                       తాదృగ్విషయవిబోధప్రబుద్ధ


తే. గీ.

పరమపురుషాంఘ్రిభక్తిసంపన్నగుణులు
సిద్ధతద్భక్తికారితాశేషతత్ప్ర
సాదకృత్కర్మరతులు ప్రసన్నపరమ
పదపతిముఖాబ్జతేజో౽నుభావసుఖులు.

173