పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

వాఙ్మనఃకాయకర్మప్రవర్తనముల
వాసి కెక్కఁగ శ్రీవైష్ణవప్రియంబు
సేయఁగాఁ దగు నదియ నారాయణప్రి
యంబు చేసిన యట్లు సత్యంబు దలఁప.

165


మ.

తగు నధ్యాత్మయదోపదిష్టభగవద్ధర్మంబు లత్యంతమున్
భగవత్ర్పీతివివర్ధనంబులు సులభ్యంబుల్ విరుద్ధాన్యధ
ర్మగుణధ్వంసకముల్ తదీయపదచర్చాసీమసంక్షేప మిం
వగునే చక్కెర చేత నుండియుఁ బ్రకోష్ఠాలేహనంబుంబలెన్.

166


మ.

విమలజ్ఞానధురీణుఁడౌ శుకున కావేదాంతవాక్యార్థత
త్వము బోధించిన శంకితాత్ముఁ డయి భీతత్వంబులో నుండ వ
శ్యముగా నచ్యుతలోకసద్గుణకథల్ సంక్షిప్తవాక్యప్రసం
గములం దెల్లము గాఁగఁ బల్కె మునిలోకస్వామి హర్షంబునన్.

167


సీ.

వత్స! ధన్యుండవు శ్రీవత్సవత్యాధిక
                       వత్సలత్వము గలవాఁడ వగుట
నవనిపై వస్తుయాథార్థ్యగోచరము నీ
                       బుద్ధి గాకున్న సమిద్దమహిమ
సంక్షేపమున రమేశ్వరవర్ణనము విన
                       నె ట్టిచ్చగించితి విట్లు నుండి
యజ్ఞసంజాతదీర్ఘాయువు కోటివ
                       క్త్రంబులు గలుగు నుత్తములకైనఁ


తే. గీ.

బ్రాప్తమై యుండు నేపరబ్రహ్మలోక
వర్ణనము సేయఁ దత్పారవశ్యజాత
హర్షరసమునఁ దద్వర్షనామృతాబ్ధి
మునిఁగి లోకంబు లెఱుఁగనే ననఘచరిత.

168


క.

ఆవిష్ణుపదము యావ
జ్జీవము వర్ణించు పూర్ణశీలు రగణ్య
ప్రావీణ్యంబున పాఠం
బావంతయుఁ దెలియఁజాల రన్యులవశమే.

169


ఆ. వె.

అరయ నీకు నాకు నంతరం బెంతేనిఁ
గలదు స్వసుఖమాత్రకలితవృత్తి
నేను సర్వలోకహితవృత్తి నీవు నీ
కిట్లు తగదె సంగ్రహేచ్ఛ నేఁడు.

170