పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

నిరతుఁడయి నిర్భరుండయి నిత్యహర్ష
శీలుఁడై శుచియై నిరాశీర్విశేషుఁ
డయి స్వవర్ణాశ్రమవయోదశాంతరోరు
కర్మములు విష్ణుసంతుష్టిగా నొ[1]నర్ప.

162


వ.

శుద్ధదేహేంద్రియమనఃప్రాణాదివృత్తియై యన్వహంబును నిజ
పూర్వజన్మానుగతకర్మానురూపప్రాప్తార్థసంచయుఁడై శ్రీశవిషయక
సంప్రీతిపూర్వకంబుఁగాఁ దద్దేహోచితసేవలు గావింపుచుఁ గృత
కృత్యుండై యవిద్యావివర్జితుండై భగవజ్జన్మకర్మంబులు వినుచుఁ
బర్వంబుల నుత్సుకుండై గీతతాండవాదిత్రంబులు భగవత్పురో
భాగంబునఁ గావింపుచు ప్రేమగర్భంబులగు మహోత్సవంబులు
సేయుచు మహోత్సవంబుల భగవత్సేవాసమాగతుల నెదుర్కొని యతి
ప్రీతిం బ్రణమిల్లి కౌగిటఁ జేర్చి యుపాయనంబు లర్పింపవలయు,
సమర్పించి తత్సమాశ్లేషహృష్టుండై తత్పుత్రుఁడుంబలెఁ బులకాంకు
రంబులతోఁ బ్రఫుల్లవదనాబ్జముతో నుత్సవాలంకృతంబైన నిజ
గృహంబునకుఁ దోడ్కొని పోయి స్వపుత్రదారాభృత్యులతోఁ బ్రణ
మిల్లి సుఖాసనార్ఘ్యపాద్యాద్యుపచారంబు లొనర్చి భగవద్భక్తశేషాన్న
పానతృప్తులం జేసి హస్తప్రక్షాళనానంతరంబున గంధమాల్యతాంబూ
లంబులు సమర్పించి సుఖాసీనులగు వారలం జూచుచుఁ దద్భుక్త
శిష్టాన్నంబు తోయసంస్కృతం బగునది భుజించి హస్తపాదప్రక్షా
ళనంబు గావించుకొని ద్విరాచమనం బొనర్చి శుచియై నారాయణదేవ
ధ్యానానందనిర్భరుండై యెన్నఁడు హరిసాక్షాత్కారం బగునని
కన్నులు మూసుకొని యంతఁ గన్నులు దెఱచి శుద్ధసత్వరూపంబగు
హరిరూపంబు గానక తత్ప్రసంగార్థియై యత్యంతాతురుండై తజ్జనాం
తకం బాశ్రయించవలయు. మఱియు.

163


క.

శ్రీమన్నారాయణచరి
తామృతరసధారఁ గ్రోల నర్హము భక్త
స్తోమములఁ గూడి జ్ఞాన
శ్రీమహిమం ద్రికరణముగ శిష్టజనంబుల్.

164
  1. నర్చ